ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే దేశం వీడి వచ్చా,,,,షేక్ హసీనా సంచలన కామెంట్లు

international |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 11:18 PM

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. దేశంలో హింస సర్వసాధారణ విషయంగా మారిపోయిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మండిపడ్డారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం.. దేశంలో శాంతిభద్రతలను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని, అల్లర్లను అదుపు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఈ మెయిల్ ఇంటర్వ్యూలో.. ఆమె బంగ్లాదేశ్ ప్రస్తుత స్థితిగతులపై విస్తుపోయే విషయాలను వెల్లడించారు. అలాగే తాను దేశం ఎందుకు వీడారో కూడా క్లారిటీగా చెప్పేశారు.


జులైలో జరిగిన ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన రాజకీయ కార్యకర్త షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య దేశంలో కొత్త హింసాకాండకు తెరలేపిందని హసీనా పేర్కొన్నారు. "ఈ దారుణ హత్య యూనస్ పాలనలో పెచ్చుమీరిన అరాచకత్వానికి నిదర్శనం. దేశం అంతర్గతంగా అస్థిరతకు గురవడమే కాకుండా.. పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. మైనారిటీలపై దాడులు, అరాచకాలు చూస్తుంటే అంతర్జాతీయ వేదికపై బంగ్లాదేశ్ విశ్వసనీయత కోల్పోతోంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


యూనస్ ప్రభుత్వం తీవ్రవాదులకు మద్దతు ఇస్తోందని హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. జైల్లో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేయడం, రాడికల్ సంస్థ జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేయడం వంటి నిర్ణయాలు దేశ సెక్యులర్ మూలాలను దెబ్బతీస్తున్నాయని ఆమె విమర్శించారు. "యూనస్ రాజకీయ నాయకుడు కాదు, దేశాన్ని పాలించే అనుభవం ఆయనకు లేదు. తీవ్రవాదులు ఆయనను ఒక ముసుగులా వాడుకుంటున్నారు. క్యాబినెట్‌లో సైతం తీవ్రవాద భావజాలం ఉన్నవారికి చోటు కల్పించడం దక్షిణ ఆసియా సుస్థిరతకే ప్రమాదం" అని హెచ్చరించారు.


తనకు విధించిన మరణశిక్షపై స్పందిస్తూ.. అది న్యాయస్థానం ముసుగులో జరిగిన రాజకీయ హత్య అని హసీనా అభివర్ణించారు. తనకు కనీసం ఆత్మరక్షణ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని, అవామీ లీగ్‌ను తుడిచి పెట్టడమే లక్ష్యంగా ఈ విచారణ సాగిందని ఆమె ఆరోపించారు. అలాగే తాను మారణహోమం జరగకూడదనే ఉద్దేశంతోనే.. దేశం వీడినట్లు చెప్పారు. అంతేకానీ భయపడి కాదని స్పష్టం చేశారు. దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ పునరుద్ధరించబడినప్పుడు తాను స్వచ్ఛందంగా దేశానికి తిరిగి వస్తానని.. అవసరమైతే అంతర్జాతీయ కోర్టులో విచారణకు హాజరు అయ్యేందుకు కూడా తాను సిద్ధమని సవాల్ విసిరారు.


ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. అవామీ లీగ్ లేకుండా జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియ కాదని, అది కేవలం ఒక పట్టాభిషేకం మాత్రమేనని ఆమె ఎద్దేవా చేశారు. తొమ్మిది సార్లు ప్రజల మద్దతు పొందిన పార్టీని నిషేధించి, కోట్లాది మంది ఓటర్లను దూరం చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమె స్పష్టం చేశారు. కష్టకాలంలో తనకు ఆశ్రయం ఇచ్చి.. అండగా నిలుస్తున్న భారత్‌కు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa