ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పాలనలో తిరుమలలో ఘోరాలు జరిగాయన్న మంత్రి జనార్థన్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 07:56 PM

వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పవిత్ర తిరుమల క్షేత్రంలో అనేక అక్రమాలు, మహాపాపాలు జరిగాయని రాష్ట్ర కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.గత ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వారి సౌకర్యాల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా నిర్లక్ష్యం వహించిందని జనార్థన్ రెడ్డి విమర్శించారు. అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాత్రపై కూడా ఇప్పుడు ప్రజలకు స్పష్టత వస్తోందని, అయితే ఆ వ్యవహారాలు న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టామని, ప్రసాదాలకు వాడే నెయ్యితో సహా అన్ని పదార్థాలను కఠినంగా పరీక్షించాకే వినియోగిస్తున్నామని తెలిపారు.రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఏకాదశి రోజున ‘వైకుంఠం దర్శనం’ ద్వారా 90 శాతానికి పైగా సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు. అసలు దేవుడిపై నమ్మకం లేని వ్యక్తికి టీటీడీ లాంటి పవిత్ర సంస్థ బాధ్యతలు అప్పగించడమే గత ప్రభుత్వపు పెద్ద తప్పిదమని ప్రజలు భావిస్తున్నారన్నారు.గత ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వ పనితీరుకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని జనార్థన్ రెడ్డి చెప్పారు. డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపట్టామని, సీఐఐ సదస్సుల ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానంగా మారిందన్నారు. కొత్త పోర్టులు, ఐదు విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.ప్రతిపక్ష నేతలు పెట్టుబడిదారులను భయపెట్టేలా మాట్లాడటం దురదృష్టకరమని, వారి బెదిరింపులకు ఎవరూ భయపడరని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం కాదని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు హాజరుకావాలని హితవు పలికారు.గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఆర్‌అండ్‌బీ శాఖను పునరుద్ధరించి, ఏడాదిలోనే రూ. 3000 కోట్ల విలువైన రహదారి పనులకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను నిర్మించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేశామని, జూన్ చివరికల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa