ప్రముఖ ఆహార పానీయాల దిగ్గజం నెస్లే శిశువుల ఆరోగ్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన ప్రధాన బేబీ న్యూట్రిషన్ ఉత్పత్తులలో ప్రమాదకరమైన టాక్సిన్ ఉన్నట్లు గుర్తించి.. ప్రపంచ వ్యాప్తంగా పలు బ్యాచ్‌లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. నెస్లే చరిత్రలోనే ఇది అతిపెద్ద రీకాల్ కాగా.. అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. గ్లోబల్ రీకాల్‌ను చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.
నెస్లే విక్రయించే ప్రముఖ బ్రాండ్లు అయిన SMA, BEBA, NAN శిశువుల ఫార్ములా పాలు ఈ రీకాల్ పరిధిలోకి వచ్చాయి. ఒక ప్రముఖ సరఫరాదారు నుంచి సేకరించిన పదార్ధంలో నాణ్యత లోపం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనివల్ల ఆ ఉత్పత్తుల్లో 'సిర్యూలైడ్' అనే టాక్సిన్ ఉండే ప్రమాదం ఉన్నట్లు సంస్థ గుర్తించింది. ఇది బాసిల్లస్ సిర్యస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ టాక్సిన్ కలిగిన ఆహారాన్ని శిశువులు తీసుకుంటే తీవ్రమైన వాంతులు, వికారం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిపై బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేస్తూ.. ఈ విష పదార్థం మరిగించడం వల్ల గానీ, వేడి నీటిని ఉపయోగించడం వల్ల గానీ నశించదని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఈ ఉత్పత్తుల వల్ల ఎవరికీ అనారోగ్యం కలిగినట్లు ఆధారాలు లేవని నెస్లే తెలిపింది. కేవలం ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది.
మీ దగ్గరున్న డబ్బా సురక్షితమేనా?
మీ వద్ద ఉన్న బేబీ ఫుడ్ సురక్షితమేనా కాదా అని తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ప్యాకెట్ లేదా డబ్బాపై ఉన్న బ్యాచ్ నంబర్‌ను తనిఖీ చేయాల్సి ఉంటుంది. పాల టిన్ లేదా బాక్స్ కింద భాగంలో కోడ్ ఉంటుంది. ముఖ్యంగా డబ్బా పక్కన లేదా పైభాగంలో, అలాగే బాక్స్ అడుగున కోడ్ ఉంటుంది. నెస్లే అధికారిక వెబ్‌సైట్‌లో ఆయా దేశాలకు సంబంధించి వెనక్కి తీసుకున్న బ్యాచ్ నంబర్ల జాబితాను ప్రచురించింది. ఒకవేళ మీ వద్ద ఉన్న ఉత్పత్తి బ్యాచ్ కోడ్ ఆ జాబితాలో ఉంటే.. వెంటనే వాడటం నిలిపివేసి కంపెనీకి సమాచారం ఇవ్వాలి.
ప్రపంచ శిశు పోషకాహార మార్కెట్‌లో సుమారు 25 శాతం వాటా కలిగిన నెస్లేకు ఇది అతి పెద్ద సవాలుగా మారింది. కొత్త సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్ ఆధ్వర్యంలో సంస్థ వృద్ధిని పెంచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఆస్ట్రియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన ప్రకారం 10కి పైగా ఫ్యాక్టరీల నుంచి 800 పైగా ఉత్పత్తులు ఈ రీకాల్ వల్ల ప్రభావితం అయ్యాయి. నెదర్లాండ్స్‌లోని ఒక ఫ్యాక్టరీలో ఈ లోపం బయటపడినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa