తెలంగాణ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఒక కీలక హెచ్చరికను జారీ చేశారు. బీహార్‌కు చెందిన ‘ట్రైడస్ రెమెడీస్’ కంపెనీ తయారు చేస్తున్న ‘అల్మాంట్-కిడ్’ (Almont-Kid) అనే సిరప్‌పై అధికారులు నిషేధం విధించారు. ఈ సిరప్‌లో చిన్నారుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే మూలకాలు ఉన్నాయని ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
సాధారణంగా జలుబు, అలర్జీల వంటి సమస్యలకు వాడే ఈ సిరప్‌లో ‘ఇథిలీన్ గ్లైకాల్’ అనే అత్యంత ప్రమాదకరమైన విషపూరిత రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రసాయనం మానవ శరీరంలోకి ప్రవేశిస్తే అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఇది దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఈ మందు నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని నిర్ధారించిన వెంటనే విక్రయాలను నిలిపివేశారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ‘అల్మాంట్-కిడ్’ సిరప్ నిల్వలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ప్రజలెవరూ కూడా ఈ సిరప్‌ను తమ పిల్లలకు వాడకూడదని ‘స్టాప్ యూజ్’ నోటీసు జారీ చేయడం జరిగింది. ఒకవేళ పొరపాటున ఈ సిరప్ వాడితే అది ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని డీసీఏ స్పష్టం చేసింది. మెడికల్ షాపుల యజమానులు కూడా ఈ బ్యాచ్‌కు చెందిన మందులను అమ్మకూడదని స్పష్టమైన నిబంధనలు విధించారు.
మీ ఇంట్లో ఒకవేళ ఈ మందు బాటిల్ గనుక ఉంటే, దానిని వెంటనే పక్కన పడేయాలని లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రభుత్వం కోరింది. ఈ మందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నా లేదా ఫిర్యాదు చేయాలనుకున్నా ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు కాల్ చేయవచ్చు. ప్రజల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు, కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa