ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోసాలు గమనించకుంటే జేబుకు చిల్లే,,,,కోడి పందేల్లో మోసాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 09:01 PM

తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పేరు చెప్పగానే ముఖ్యంగా అందరికి గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు. వాటితో పాటు మరికొన్ని చోట్ల జరిగే కోడి పందాలు. చట్ట పరంగా కోడి పందేలు నిర్వహించడం నేరం. కానీ సంక్రాంతి సీజన్లో పందేలు జరగడం అనేది కామన్‌గా మారిపోయింది. అందుకే సంక్రాంతి వచ్చిందంటే చాలు పందెం రాయుళ్లకు ఎక్కడలేని హుషారొస్తుంది. బరిలో కోడి కాలు దువ్వుతుంటే.. ఆస్తులు పణంగా పెట్టడానికైనా వెనుకాడరంటే అతిశయోక్తి కాదు. పందెం రాయుళ్ల ఉరకలెత్తే ఉత్సాహాన్ని.. నిర్వాహకులు క్యాష్ చేసుకుంటారు. గెలుపు ఓటములను నియంత్రిస్తూ.. ఓడిపోయే కోడి గెలిచేలా, గెలిచే కోడి ఓడిపోయాలా మాయ చేస్తారు. అందుకే పందెం రాయుళ్లు తమ జేబులను చిల్లు చేసుకోవడం తప్ప.. వారికి వచ్చే ప్రయోజనం ఏం ఉండదు!. కోడి పందేలు కాసేటప్పుడు ఎలాంటి మోసాలు చేస్తారో తెలుసుకుందాం..


సాధారణంగా కోడి పుంజు రంగు, రెక్కలు అన్నింటిని చూసుకుని పందెం రాయుళ్లు.. దానిపై పందె కాస్తారు. కానీ వారు పందెం కాసిన పుంజు అనూహ్యంగా నేలకొరుగుతుంది. వారి అనుభవాన్ని రంగరించి వేసిన అంచనాలన్నీ తలకిందులు అవుతాయి. వారు వేసిన అంచనాలు సరైనవే అయినా.. మోసగాళ్లు చేసే మాయల ముందు ఓడిపోతారు. ఎందుకంటే.. పందెంలో ఒక పుంజు చెవులు, నెత్తి మీద ఒక రకమైన మందును రాస్తారు. సాధారణంగా ఇలాంటి మందును మత్తు కోసం చేపల చెరువుల వద్ద కొంగలకు పెడతారు. కోడి పుంజులను బరిలో దింపే ముందు.. వాటికి పౌరుషం వచ్చేందుకు ఒకదానికొకటి కరిపిస్తుంటారు. అలా చేసినప్పుడు ఓ పుంజు నోట్లోకి మందు వెళుతుంది. దీంతో దానికి మత్తు ఎక్కుతుంది. అవతలి పుంజు గెలుస్తుంది. ఈ విషయం తెలియక పందెం రాయుళ్లు మోసపోతారు.


జోడీ పందేళ్లో మరో రకమైన మోసం జరుగుతుంది. ఉదాహరణకు ఇద్దరు జోడీ పందేలకు సిద్ధమయ్యారు అనుకుందాం. మొదటి వ్యక్తి బలంగా ఉన్న పుంజుని బరిలోకి దింపుతాడు. రెండో వ్యక్తి పుంజు చూడటానికి బలంగా ఉన్నా.. పందెంలో గాల్లోకి ఎగరలేదు. దీంతో మొదటి వ్యక్తి పుంజు ధాటికి.. రెండో వ్యక్తి పుంజు చతికిలపడిపోతుంది. ఆ తర్వాతి పందెంలో సీన్ రివర్స్ అవుతుంది. ఒకసారి గెలిచాడు కాబట్టి మొదటి వ్యక్తి పుంజులు బాగున్నాయని పందెం కాస్తారు. కానీ రెండో పందెంలో రెండో వ్యక్తి పుంజు గెలుస్తుంది. ఇలా ముందస్తు అవగాహనతో పుంజులను తారుమారు చేస్తూ కూడా మోసాలు చేస్తారు కాబట్టి పందెం రాయుళ్లు వీటిని నిశితంగా గమనించాలి.


కోడి పందేల్లో కోడి పుంజులకు కత్తులు కడతారనే విషయం తెలిసిందే. అయితే ఈ కత్తులు కట్టే టెక్నిక్ కూడా గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. మోసగాళ్లు పుంజుకు ఒకవైపు అసలు కత్తి, రెండో వైపు డమ్మీ కత్తి కడతారు. చూడటానికి డమ్మీ కత్తి చాలా పదునుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ.. బరిలోకి దింపే ముందు పుంజు నడిచేసరికే దాని పదును పోతుంది. ఈ డమ్మీ కత్తి కట్టి పుంజు.. అవతలి పుంజు చర్మం మాత్రే చీల్చగలుగుతుంది. కానీ నిజమైన కత్తులు కట్టిన పుంజు కొడితే.. డమ్మీ కత్తి పుంజుకు కండరాలు చీలిపోతాయి. దెబ్బకు నేలకొరిగి ప్రాణాలమీదకు వస్తుంది. కత్తి కట్టే యాంగిల్ కూడా కీలకమే. కావాలంటే తమ కోడి గెలిచేలా.. ఎదుటి కోడికి త్వరగా దెబ్బలు తగిలేలా కత్తి కడతారు. ఒకవేళ ఓడాలనుకుంటే మాత్రం.. కత్తి వదులుగా కట్టి పందెం సమయంలో అది త్వరగా ఊడిపోయేలా కడతారు. దీని వల్ల కోడి పుంజు ఓడిపోతుంది.


ఇదే కాకుండా మధ్యవర్తులు కూడా తాము అనుకున్న పుంజును గెలిపించడం కోసం పలు ఎత్తులు వేస్తారు. తాము అనుకున్న పుంజు ఓడిపోతుంది అన్న సమయంలో బ్రేక్ ఇస్తారు. దీంతో గెలిచే అవకాశం ఉన్న పుంజు జోరు తగ్గిపోతుంది. ఇక ఓడిపోయే పుంజు చివరి నిముషంలో విరోచితంగా పోరాడుతుంది. దీంతో గెలుపోటములు తారుమారు అవుతాయి.


బరిలోకి దిగే ముందు ప్రత్యర్థి కోడి పుంజుకు మత్తు పదార్థాలు లేదా నీరసపరిచే మందులు ఇస్తారు. దీనివల్ల ఆ కోడి చతికిలపడుతుంది. కొంత మంది తమ పందెంలో ఎలాగైనా గెలవడం కోసం తమ పుంజులకు ఉత్ప్రేరకాలను కూడా ఇస్తారు. ఇవి వాటికి అసాధారణ వేగాన్ని, బలాన్ని ఇస్తాయి. కొంత మంది కోళ్లకు నొప్పి తెలియకుండా ఉండే పెయిన్ కిల్లర్లు ఇస్తే.. మరికొందరు కోళ్లలో ఆవేశం, కోపం పెంచే మందులు, పదార్థాలు ఇస్తారు. ఇక కొందరైతే కోడి కాళ్లకు కట్టే కత్తికి విషాన్ని పూస్తారు. దీనివల్ల ప్రత్యర్థి కోడికి చిన్న దెబ్బ తగిలినా నేలకు ఒరుగుతుంది. కొంత మంది ఐస్ ముక్కలు, రసాయనాలను ఉపయోగించి గాయపడిన కోళ్లు త్వరగా కోలుకునేలా చేస్తారు. కోడి పందేల సమయంలో ఇలా రకరకాలుగా మోసాలు చేస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa