ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌ను తానే స్వయంగా ఆమోదించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్ అగ్రనేత అయాతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌లో మరణించిన నేపథ్యంలో,ఆయన వారసుడి ఎంపికపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.యాక్సియోస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని కొత్త అధినేతగా నియమించడాన్ని తాను అంగీకరించనని స్పష్టం చేశారు. "ఇరాన్‌కు శాంతి, సామరస్యాన్ని తీసుకొచ్చే వ్యక్తి కావాలి. ఖమేనీ విధానాలనే కొనసాగించే వ్యక్తి వస్తే, మరో ఐదేళ్లలో మళ్లీ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఖమేనీ కుమారుడు ఒక పనికిరాని వ్యక్తి. వెనిజులాలో డెల్సీ రోడ్రిగ్జ్‌ను మధ్యంతర అధ్యక్షురాలిగా నియమించిన తరహాలోనే, ఇక్కడ కూడా నేను కచ్చితంగా జోక్యం చేసుకుంటాను" అని ట్రంప్ అన్నారు.మొజ్తబా ఖమేనీ, తన తండ్రి తర్వాత సుప్రీం లీడర్ పదవికి ప్రధాన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. అయితే, వారసత్వంగా ఈ పదవిని చేపట్టడాన్ని 2024లోనే అలీ ఖమేనీ వ్యతిరేకించారు. బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ కథనం ప్రకారం, మొజ్తబా ఖొమైనీకి 100 మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్నట్లు అంచనా. కాగా, ప్రభుత్వంలో ఎలాంటి పదవిలో లేకపోయినా తన తండ్రి కార్యాలయంలో పనిచేస్తూ ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ 2019లోనే ట్రంప్ ప్రభుత్వం మొజ్తబాపై ఆంక్షలు విధించింది.మరోవైపు ఇరాన్‌లో అధికార మార్పు తమ లక్ష్యం కాదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థ, నౌకాదళాన్ని ధ్వంసం చేయడం, అణ్వాయుధాలు లేకుండా చూడటమే తమ ఆపరేషన్ లక్ష్యమని ఆయన తెలిపారు.ఇదే సమయంలో ఇరాన్ చివరి చక్రవర్తి కుమారుడైన రెజా పహ్లావి తాను తాత్కాలిక నేతగా తిరిగి వస్తానని, ఆ తర్వాత ఇరాన్‌ను లౌకిక ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు కొత్త రాజ్యాంగం రూపొందించాలని ప్రతిపాదించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ కింద ఏ కొత్త నాయకుడు వచ్చినా చట్టబద్ధత ఉండదని ఆయన పేర్కొన్నారు. ఖమేనీ మరణంతో ఇరాన్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి, ట్రంప్ వ్యాఖ్యలతో మరింత తీవ్రరూపం దాల్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa