ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీదీ వరుస విజయాల వెనుక ప్రతీక్ జైన్.. ఐ-ప్యాక్ మ్యాజిక్‌తో తిరుగులేని శక్తిగా టీఎంసీ

national |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 09:32 PM

అసెంబ్లీ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజకీయ వ్యూహకర్త సంస్థ అయిన ఐ ప్యాక్ ఆఫీస్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేయడం.. ఆ విషయం తెలిసి తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి చేరుకుని.. అక్కడ కీలక డాక్యుమెంట్లు, ఫోన్ బయటికి తీసుకువచ్చి.. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలపై సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం బెంగాల్ ఎన్నికల వేళ పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా టీఎంసీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐ ప్యాక్ సంస్థ ప్రతీక్ జైన్ నాయకత్వంలో దూసుకెళ్తోంది.


బెంగాల్‌లో గత 6 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఐ ప్యాక్ సంస్థ పనిచేస్తోంది. టీఎంసీ సాధిస్తున్న వరుస విజయాల వెనుక ఐ ప్యాక్ పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకంగా మారింది. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల వరకు ఆ పార్టీ సాధించిన అద్భుతమైన స్ట్రైక్ రేట్ వెనుక టెక్నాలజీ, డేటా మైనింగ్, క్షేత్రస్థాయి పరిశోధనల సమ్మేళనం ఉంది. ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా ప్రతీక్ జైన్ నేతృత్వంలో ఆ సంస్థ తృణమూల్ వ్యూహాలకు పదును పెడుతోంది.


పునాది వేసిన 'దీదీ కే బోలో'


2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడంతో బెంగాల్‌లో టీఎంసీ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఆ సమయంలోనే మమతా బెనర్జీ ఐ ప్యాక్‌తో ఒప్పందం చేసుకున్నారు. కేవలం ఒక ఫిర్యాదుల విభాగంలా కనిపించిన 'దీదీ కే బోలో' కార్యక్రమం ద్వారా ప్రజల అసలు సమస్యలను ఐ ప్యాక్ సంస్థ గుర్తించింది. ఈ డేటా ఆధారంగానే 'లక్ష్మీర్ భండార్', 'దువారే సర్కార్' వంటి సంక్షేమ పథకాలు.. బెంగాల్‌లో పురుడుపోసుకున్నాయి. ఇవి మహిళా ఓటర్లను టీఎంసీ పార్టీకి దగ్గర చేయడంలో సానుకూల ప్రభావం చూపాయి.


టీఎంసీకి నీడలా ఉండి నడిపిస్తున్న ప్రతీక్ జైన్


2021 తర్వాత ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల కోసం బిహార్ వెళ్లడంతో.. ఐ ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ పశ్చిమ బెంగాల్ బాధ్యతలను చేపట్టారు. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన ప్రతీక్ జైన్.. ప్రశాంత్ కిశోర్ లాగా వెలుగులోకి రాకుండా తెరవెనుక ఉండి పనిచేయడానికి ఇష్టపడతారు. బెంగాల్ భౌగోళిక రాజకీయాలపై ఆయనకు ఉన్న పట్టు.. డేటా ఆధారంగా తీసుకునే నిర్ణయాలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల పూర్తి నమ్మకాన్ని గెలుచుకున్నాయి. 2024 ఎన్నికల్లో టీఎంసీ సాధించిన విజయం ప్రతీక్ జైన్ నాయకత్వానికి పెద్ద నిదర్శనంగా నిలిచింది.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓటమి తర్వాత.. భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు అనే అంశాన్ని ఐ ప్యాక్ సంస్థ గుర్తించింది. దీన్ని అధిగమించేందుకు పశ్చిమ బెంగాల్‌లో ముందస్తుగానే వ్యూహాలు సిద్ధం చేశారు. బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏ) జాబితాను సిద్ధం చేయడం.. 'దీదీర్ దూత్' యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో తృణమూల్ పార్టీ పైచేయి సాధించేలా ప్రతీక్ జైన్ టీమ్ పక్కా ప్రణాళికలు వేసింది. దీనివల్ల ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కోవడానికి ఇప్పుడు టీఎంసీ.. టెక్నికల్‌గా రెడీ అయి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa