కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు, తమిళ వెట్రిగం కళగం ( టీవీకే) చీఫ్ విజయ్‌కు మరోసారి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) సమన్లు జారీచేసింది. జనవరి 12న సోమవారం విజయ్ సీబీఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆరు గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారని, తొక్కిసలాటలో 41 మంది మరణాలకు తమ పార్టీ బాధ్యత వహిస్తుందని ఆయన చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విజయ్ను సీబీఐ మొత్తం 19 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. సెప్టెంబరు 27 న కరూర్‌లో విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసుపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్, మద్రాసు హైకోర్టు సిట్‌ను ఏర్పాటుచేయగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పగించారు. అలాగే, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన ప్యానెల్ సీబీఐ విచారణను పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ ఏడాది జరగబోయే ఎన్నికల కోసం విజయ్ జిల్లాల పర్యటన చేపట్టారు. కరూర్ జిల్లా పర్యటన సందర్భంగా నిర్ణీత సమయానికంటే విజయ్ వేదిక వద్దకు చేరుకోవడంలో జాప్యం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు. ఆహారం, నీరు, టాయిలెట్ సౌకర్యాలు వంటి తగిన ఏర్పాట్లు లేవని, ఆగ్రహంతో ఉన్న జనం అదుపు తప్పారని వారు పేర్కొన్నారు. అయితే, విజయ్ పార్టీ ఈ ఆరోపణలను ఖండించింది, దీని వెనుక అధికార డీఎంకే కుట్ర ఉందని విజయ్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణను అధికార పార్టీ తిరస్కరించింది. జనసమూహ నిర్వహణ సరిగా లేకపోవడం, వేదికకు వెళ్లే రోడ్లపై ఉన్న అడ్డంకులను తొలగించడంలో పోలీసులు విఫలమయ్యారని కూడా ఆయన ఆరోపించారు.
కాగా, ఈ ఘటన తర్వాత రాజకీయ నాయకుల సభలు, ర్యాలీలకు తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విజయ్ సభలకు మొత్తం 84 షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. కాగా, బాధితులను నేరుగా ఓదార్చడానికి వస్తానని హామీ ఇచ్చిన విజయ్.. అలా కుదరకపోవడంతో మహాబలిపురంలోని ఓ రిసార్ట్ వద్ద వారిని కలిసి పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు చొప్పున పరిహారం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa