ఏపీలో క్రీడారంగాన్ని ప్రోత్సాహించడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. అందులో భాగంగా ఖేలో ఇండియా పథకం కింద ఏపీలో క్రీడారంగానికి చెందిన వివిధ పనులకు నిధులు మంజూరు చేసింది. ఆ క్రమంలోనే గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి కేంద్రం ఖేలో ఇండియా పథకం కింద నిధులు విడుదల చేసింది. దీంతో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి అడుగులు పడనున్నాయి. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. చాలాకాలంగా స్టేడియం అభివృద్ధికి నోచుకోలేదు. తాజాగా కేంద్రం తీసుకుంటున్న చర్యలతో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం పునర్వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి..
మరోవైపు రాష్ట్రంలో క్రీడారంగం మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి రూ.170 కోట్లతో రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలలో భాగంగా ఖేలో ఇండియా పథకం కింద గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అధునాతన సౌకర్యాలతో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 14 కోట్లు మంజూరు చేసింది. ఈ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నారు. అలాగే స్టేడియం అభివృద్ధికి దశలవారీగా నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించినట్లు తెలిసింది.
ఈ పనులు అన్నీ పూర్తి అయితే.. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ప్రపంచస్థాయి శిక్షణ, పోటీ వసతులు అందుబాటులోకి వస్తాయి. యువ ప్రతిభను పెంపొందిస్తుంది, ఈ ప్రాంతంలోని అథ్లెట్లకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే.. మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ అథ్లెట్లు ఉన్నత స్థాయిలలో పోటీ పడటానికి అవకాశాలను సృష్టిస్తుందని , క్రీడలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని అన్నారు.
గత ప్రభుత్వం చరిత్రాత్మక స్టేడియాన్ని నిర్లక్ష్యం చేసిందన్న ఎమ్మెల్యే.. స్టేడియాన్ని తాము పునరుద్ధరించబోతున్నట్లు తెలిపారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు ఫలించి నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఖేలో ఇండియా పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించిన ప్రతిపాదన సమర్పించిన తర్వాత కేంద్రం త్వరితగతిన అనుమతి ఇస్తుందని అధికారులు సైతం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సైతం పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని.. షెడ్యూల్ ప్రకారం పూర్తి అవుతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. పునరుద్ధరణతో బ్రహ్మానందరెడ్డి స్టేడియం.. కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుందని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa