ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధుల దేశంగా చైనా?.. 1949 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి బర్త్‌రేట్

international |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 11:12 PM

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా దశాబ్దాల పాటు వెలుగొందిన చైనా.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడుతోంది. డ్రాగన్ దేశంలో జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోవడంతో అక్కడ జనాభా సంక్షోభం ముదురుతోంది. సోమవారం చైనా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. 2025లో జననాల రేటు 1949 తర్వాత ఎన్నడూ లేనంత కనిష్టానికి చేరుకుంది.


మరణాలే ఎక్కువ.. జననాలు తక్కువ!


వరుసగా నాలుగో సంవత్సరం కూడా చైనాలో పుట్టిన వారి కంటే మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. 2025లో కేవలం 7.82 మిలియన్ల మంది శిశువులు మాత్రమే జన్మించారు. ఇది 2024లోని 9.54 మిలియన్లతో పోలిస్తే భారీ తగ్గుదల. గతేడాది 11.31 మిలియన్ల మంది మరణించారు. దీంతో దేశ జనాభా క్రమంగా తగ్గిపోతూ.. వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతి 1,000 మందికి జననాల రేటు 5.63కు పడిపోయింది.


పిల్లల్ని కనడాన్ని ఒక దేశభక్తితో కూడిన చర్యగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. యువత నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. జనాభాను పెంచేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అనేక కఠినమైన మరియు వింతైన చర్యలను చేపట్టింది. ముఖ్యంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి కండోమ్‌లు, గర్భనిరోధక మందులపై 13 శాతం పన్ను విధించింది. అంతేకాకుండా మహిళల ఋతుక్రమాలను ట్రాక్ చేయడం, వైద్యపరంగా అవసరం లేని గర్భస్రావాలను తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలు కూడా తీసుకుంది. అక్కడితో ఆగకుండా కొత్తగా పెళ్లయిన వారికి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి నూరిపోస్తూ.. పెళ్లిళ్ల బ్రోకర్లు, పేరయ్యలకు నగదు బహుమతులు కూడా ప్రకటిస్తోంది.


ప్రభుత్వ ఆఫర్లు ఉన్నప్పటికీ.. ఆర్థిక ఒత్తిడి, పెరిగిన జీవన వ్యయం కారణంగా చైనా యువత పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపడం లేదు. "కండోమ్‌ల ధరలు పెరిగినంత మాత్రాన పిల్లల్ని కనలేం.. ప్రస్తుతం మా ఆర్థిక స్థితి అందుకు సహకరించడం లేదు" అని 28 ఏళ్ల జోనాథన్ జు వంటి యువకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా పని చేసే యువశక్తి తగ్గిపోవడం చైనా ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారింది. 2035 నాటికి చైనాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 400 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును కూడా పెంచింది. 2040 నాటికి పురుషులకు 63 ఏళ్లు, ఆఫీసు పనులు చేసే మహిళలకు 58 ఏళ్లుగా పదవీ విరమణ వయస్సును ఖరారు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa