ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీన్‌లాండ్‌ స్వాధీనానికి బలవంతం చేయను, కానీ.. ట్రంప్ సంచలన ప్రకటన

international |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 10:37 PM

డెన్మార్క్ ఆధీనంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని కొనుగోలు చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్విట్జర్లాండ్ దావోస్‌ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన చేసిన ప్రసంగం అటు దౌత్యపరంగా, ఇటు ఆర్థిక మార్కెట్లలో సంచలనం సృష్టించింది. గ్రీన్‌లాండ్‌ దక్కించుకోవడానికి తాను సైనిక శక్తిని ఉపయోగించబోనని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. అయితే.. ఈ ద్వీపం ఉత్తర అమెరికాలో భాగమని.. చారిత్రక అవసరాల దృష్ట్యా అమెరికా దీనిపై చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.


డెన్మార్క్‌కు హెచ్చరిక


గ్రీన్‌లాండ్‌ విక్రయానికి డెన్మార్క్ అంగీకరించకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓకే అంటే తాము అభినందిస్తామని.. లేదంటే ఆ విషయాన్ని గుర్తుంచుకుంటామంటూ పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి. అయితే తన ప్రసంగంలో గ్రీన్‌లాండ్‌ బదులుగా ఐస్‌లాండ్ అని వాడటం గందరగోళానికి దారితీసింది. గ్రీన్‌లాండ్‌‌కు సైన్యాన్ని పంపిన 8 ఐరోపా దేశాలపై 10 శాతం సుంకాలు విధిస్తానన్న ట్రంప్ హెచ్చరికలతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యూరోపియన్ సెంట్రోల్ బ్యాంకు (ఈసీబీ) ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే వంటి నేతలు నిరసనగా చర్చల నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.


ఈ సందర్భంగా ఐరోపా దేశాలపై ట్రంప్‌ తీవ్రంగా మండిపడ్డారు. అవి సరైన దిశలో వెళ్లడం లేదని ఆరోపించారు. భారీగా వచ్చే వలసలపై ఐరోపాలో కంట్రోల్ లేదని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా డెవలప్‌మెంట్‌ అవుతోందని తెలిపారు. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశామని.. ప్రపంచ ఆర్థిక ఇంజిన్‌గా అమెరికా నిలుస్తోందన్నారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలు సంతోషంగా పేర్కొన్నారు. 2 ఏళ్ల క్రితం అమెరికా నిర్జీవ ఆర్థిక వ్యవస్థగా ఉండేదని.. ఇప్పుడు తిరిగి సజీవంగా మారిందని వెల్లడించారు.


ఐరోపా ఖండంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ గుర్తింపు లేదని.. కానీ తనకు అవి అంటే చాలా ఇష్టమని తెలిపారు. గతంలో జరిగిన నష్టాలను తిరిగి పునరుద్ధరించేందుకు విదేశాలపై టారిఫ్‌లు పెంచుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గుర్తు చేశారు. చాలా కాలం వెనెజులా అద్భుతంగా ఉండేదని.. కానీ వారి సొంత విధానాలతో వారే నాశనం చేసుకున్నారని తెలిపారు. తాము దాడి చేసిన తర్వాత డీల్‌ కుదుర్చుకున్నారని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa