జమ్మూ కశ్మీర్లో శుక్రవారం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కథువా జిల్లాలోని బిల్లావర్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో పాకిస్థాన్ ఉగ్రవాది హతమైనట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. అతడ్ని జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదిగా గుర్తించినట్టు చెప్పారు. బిల్లావర్ ప్రాంతంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని జమ్మూ ఐజీపీ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ ప్రాంతంలో ఇంకా తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతున్నట్టు ఆర్మీ వైట్ నైట్ కార్ప్స్ పేర్కొంది.
‘‘నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా జనవరి 23న కథువాలోని పర్హేతర్ ప్రాంతంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. ఉగ్రవాదులు నక్కిన ప్రదేశాన్ని గుర్తించారు... సంయుక్త బలగాలు జరిపిన కచ్చితమైన దాడిలో ఒక విదేశీ ఉగ్రవాది హతమయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’’ అని ఆర్మీ వెల్లడించింది. కాగా, ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ ప్రాంతంలో ఇంకా ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారు? సైన్యం వైపు ఎవరికైనా గాయాలయ్యాయా? అనేది స్పష్టత రాలేదు.
రెండు రోజుల కిందట కార్గిల్ తరహా జైషే మహ్మద్ ఉగ్రవాదుల బంకర్ బయటపడిన సంగతి తెలిసిందే. సముద్ర మట్టానికి 12000 అడుగుల ఎత్తులో. గడ్డకట్టే చలిలోనూ నెలల తరబడి నివాసం ఉండేలా జైషే ముష్కరులు.. ఒక రహస్య కోటను నిర్మించుకున్నారు. సోమవారం ఈ రహస్య స్థావరాన్ని సైన్యం చేధించింది. దీంతో కొందరు ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో కథువా వద్ద ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
గణతంత్ర దినోత్సవం వేళ.. దేశంలో అలజడికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్లో పాక్ మద్దతున్న ముష్కర మూకల కార్యకలాపాలు ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నట్టు ఇటీవల నిఘా వర్గాలు గుర్తించాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత మళ్లీ పాకిస్థాన్ ఉగ్రమూకలు ముఖ్యంగా లష్కరే తొయిబా , జైషే మహమ్మద్‌లు సమన్వయ దాడులకు సిద్ధమవుతున్నట్టు పక్కా సమాచారం వచ్చింది. గతేడాది నవంబరు 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడితో యావత్తు దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనకు ముందు ఫరీదాబాద్‌లోని అల్ సఫా యూనివర్సిటీలో వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa