దక్షిణ భారతదేశంలో అరటి ఆకులపై ఆహారాన్ని వడ్డించే సంప్రదాయం తరతరాలుగా ఉంది. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్లు, వివాహాది కార్యక్రమాల్లో అరటి ఆకులపైనే భోజనం వడ్డిస్తారు. ఇది మన సంస్కృతిలో ఒక అందమైన భాగం మాత్రమే కాదు. మన పూర్వీకుల లోతైన శాస్త్రీయ అవగాహనకు నిదర్శనం. అరటి ఆకుపై వడ్డించే ఆహారం కేవలం సాంస్కృతిక సంప్రదాయం కంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని నిపుణఉలు అంటున్నారు.
ఇది ముఖ్యంగా పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేడి వేడి ఆహారం అరిటాకుల్లో వడ్డించినప్పుడు అవి వాటి ఉపరితలంపై కనిపించని పోషకాలు, సువాసనల్ని విడుదల చేస్తాయి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక కడుపు సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. అరటి ఆకులపై తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి డాక్టర్ శ్రుతి ఆర్య (కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్, స్పార్ష్ హాస్పిటల్, సర్జాపూర్ రోడ్, బెంగళూరు) వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మెరుగైన జీర్ణక్రియ
సాధారణంగా జీర్ణక్రియ మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. మనం ఏం తింటాం, ఎంత త్వరగా తింటాం, ఆహారం పట్ల గట్ ప్రతిస్పందన. అరటి ఆకుల్లో తినడం వల్ల ఈ మూడు అంశాల్లో కనీసం రెండింటిని ప్రభావితం చేస్తాయి.
వేడి అన్నం, సాంబార్ లేదా కూరల్ని తాజా అరటి ఆకుపై ఉంచినప్పుడు.. దాని ఉపరితలం కొన్ని సహజ సుగంధ సమ్మేళనాల్ని విడుదల చేస్తుంది. ఈ ఆకులు సూక్ష్మమైన, మట్టి రుచిని ఇస్తాయి. ఇది భోజనం యొక్క ఆనందాన్ని పెంచుతుంది. వాసన, రుచి లాలాజాలాన్ని, గ్యాస్ట్రిక్ రసాల స్రావాన్ని పెంచుతాయి. ఇది జీర్ణక్రియ యొక్క ప్రారంభ ప్రక్రియను సక్రియం చేయడానికి సాయపడుతుంది.
రుచి పెరుగుతుంది
సాధారణ పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ ప్లేట్స్‌లో తింటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. వీటిలో భోజనం చేయడం ఏదోలా అనిపిస్తుంది. అదే అరటి ఆకు మీద తినడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. అరటి ఆకు మీద వేడి ఆహారాన్ని వడ్డించినప్పుడు సున్నితమైన, మట్టి రుచిని ఇస్తాయి. ఇది చాలా సహజంగా అనిపిస్తుంది. భోజనం యొక్క ఆనందాన్ని పెంచుతుంది. అందుకే చాలా మంది ఆకు మీద వడ్డించిన ఆహారాన్ని రుచికరంగా, సంతృప్తికరంగా భావిస్తారు.
పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి
అరటి ఆకుల్లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సహజ యాంటీఆక్సిడెంట్లు. వేడి ఆహారాన్ని ఆకుపై ఉంచినప్పుడు ఈ పోషకాలు ఆహారంలోకి విడుదలవుతాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడతాయి. వేడి ఆహారాన్ని ఆకుపై వడ్డించినప్పుడు,
ఈ ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు తక్కువ మొత్తంలో ఆహారంలోకి బదిలీ కావచ్చు. ఇది పేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. అయితే, అనేక అధ్యయనాల ప్రకారం ఆహారం ద్వారా శోషించబడిన ఈ సమ్మేళనాల పరిమాణం ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. ఇంకా కొన్ని పరిశోధనలు అవసరం.
రసాయనాలు ఉండవు
ప్లాస్టిక్ లేదా థర్మోకోల్ ప్లేట్ల మాదిరిగా కాకుండా, అరటి ఆకులు పూర్తిగా సహజమైనవి. పరిశుభ్రమైనవి. ఆహారంతో పాటు మీ కడుపులోకి ప్రవేశించి జీవక్రియకు హాని కలిగించే హానికరమైన రసాయనాలు ఉండవు. వేడి ఆహారంతో పాటు ప్లాస్టిక్ ప్లేట్ల నుంచి మైక్రోప్లాస్టిక్ కంటెంట్, కొన్ని రసాయనాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని పలు నివేదికలు చెబుతున్నాయి. అదే అరటి ఆకులు సహజమైన రసాయన రహిత అనుభూతిని అందిస్తాయి.
మెండుగా పోషక విలువలు
అరటి ఆకుల్లో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆహారాన్ని అరటి ఆకుపై నిల్వ చేసినప్పుడు, ఈ పోషకాలలో కొన్ని ఆహారంలోకి బదిలీ చేయబడతాయి. దాని పోషక విలువ మరింత పెరుగుతుంది. ఇంకా, అరటి ఆకులలో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆహారాన్ని బ్యాక్టీరియా నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా మంచి పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa