అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. మచ్చలు, మొటిమలు లేని అందమైన ముఖం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇక, జుట్టు బలంగా పెరగడానికి చాలా మంది వివిధ రకాల నూనెలు వాడతారు. అలాగే, ముఖంలో మెరుపు కోసం కూడా చాలా రకాల ఆయిల్స్ వాడుతుంటారు. చర్మాన్ని తేమగా ఉంచడానికి శతాబ్దాలుగా నూనెను ఉపయోగిస్తున్నారు. బాదం నూనె, కొబ్బరి నూనె, ఆముదం, రోజ్మేరీ ఆయిల్స్ వంటివి వాడుతుంటారు. ఈ సహజ నూనెలు చర్మానికి లోపలి నుంచి కావాల్సిన పోషణను అందిస్తాయి.
చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా మెరుపుని ఇస్తాయి. నూనెలు పొడి చర్మానికి మాత్రమే కాదు. కొన్ని నూనెలు పిగ్మెంటేషన్, వృద్ధాప్యం, మొటిమలు తగ్గడానికి కూడా సాయపడతాయి. అయితే, ముఖంపై అప్లై చేయడానికి ఏ నూనె ఉత్తమమో చాలా మందికి క్లారిటీ ఉండదు. ఈ గందరగోళంపై క్లారిటీ ఇచ్చారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని నూనెలకు రేటింగ్ ఇచ్చారు. ఈ రేటింగ్ ప్రకారం ఏ నూనె మీకు బెస్టో తెలుసుకోండి.
బాదం నూనెకు ఎంత రేటింగ్?
చాలా మంది ముఖానికి బాదం నూనె వాడుతుంటారు. హీరోయిన్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. బాదం నూనెను ముఖానికి మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తారు. బాదం నూనెలో విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు మెండుగా ఉన్నాయి.
ఇది చర్మంలోకి బాగా శోషించబడుతుంది. న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా బాదం నూనెకు 10కి 9 రేటింగ్ ఇచ్చారు. పొడిచర్మం ఉన్నవారికి ఇది బెస్ట్ అంటున్నారు. కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో బాధపడేవారికి బాదం నూనె బెస్ట్ ఆప్షన్. బాదం నూనెతో మసాజ్ చేస్తే ముఖం మెరిసిపోతుంది.
కొబ్బరి నూనెకి తక్కువ రేటింగ్
చాలా మంది కొబ్బరి నూనె జుట్టు కోసం వాడతారు. కొందరు దీనిని ముఖానికి కూడా అప్లై చేస్తారు. అయితే దీనికి చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు శ్వేతా షా. కొబ్బరి నూనె 10కి గాను 4 మాత్రమే రేటింగ్ ఇచ్చారు. ఆమె ప్రకారం కొబ్బరి నూనె అందరికీ సరిపోదు. పొడి చర్మంతో బాధపడేవారు కొబ్బరి నూనెను మాయిశ్చరైజర్‌గా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి వారు అప్లై చేసుకోవడం వల్ల చర్మం మృదువుగా, తేమగా మారుతుంది. అయితే, ఇది రంధ్రాల్ని మూసుకుపోయేలా చేస్తుందని ఆమె తెలిపారు. దీంతో మొటిమలు, జిడ్డు చర్మంతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కాదు.
కుంకుమాది తైలంకి రేటింగ్ ఎంతంటే
కుంకుమాది తైలం అనేది ముఖానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఆయుర్వేద నూనె. న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా దీనికి 10కి 10 రేటింగ్ ఇచ్చారు. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సాయపడుతుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్ తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమల్ని తగ్గించి, చర్మం స్థితిస్థాపకతను మెరుగపర్చడంలో సాయపడుతుంది. చర్మానికి సాగే గుణాన్ని ఇవ్వడంలో సాయపడుతుంది.
ఆముదానికి కూడా తక్కువ రేటింగ్
పోషకాహార నిపుణులు ఆముదం నూనెకు 10కి 4 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. శ్వేతా షా ప్రకారం ఇది మొత్తం ముఖానికి మంచిది కాదు. అయితే, మీరు దీన్ని కనుబొమ్మలు, వెంట్రుకలకు అప్లై చేయవచ్చు. రాత్రంతా అలాగే ఉంచడం వల్ల వాటి పెరుగుదల మెరగవుతుందని న్యూట్రిషనిస్ట్ చెబుతున్నారు.
కుంకుమ పువ్వు నూనెకి రేటింగ్ ఎంతంటే
ఈ నూనెను కుంకుమ పువ్వు నుంచి తీస్తారు. ఈ నూనె నల్ల మచ్చలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ముఖానికి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. శ్వేతా షా దీనికి 10కి గాను 9 రేటింగ్ ఇచ్చారు. మీ చర్మం మెరుపును కోల్పోతే మాయిశ్చరైజర్‌లో రెండు చుక్కల కుంకుమ పువ్వు నూనెను కలిపి అప్లై చేయండి. ఇది పిగ్మెంటేషన్ తొలగించడంలో సాయపడుతుంది. చర్మం రంగును సమం చేస్తుందని న్యూట్రిషనిస్ట్ తెలిపారు.
రోజ్ షిప్ ఆయిల్
న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా రోజ్ షిప్ ఆయిల్‌కి 10కి 9 రేటింగ్ ఇచ్చారు. ఈ నూనె అడవి గులాబీ మొక్కల విత్తనాల నుంచి తీస్తారు. ఈ ఆయిల్‌లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయని శ్వేతా షా తెలిపారు. ఇవి ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గించడంలో సాయపడతాయని ఆమె తెలిపారు. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని దృఢంగా ఉంచడంలో సాయపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa