అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఏబీ వెంకటేశ్వరరావు తనపై చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ బొలిశెట్టి సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తన పోరాటం రాజకీయాల కోసం కాదని, కేవలం పర్యావరణ పరిరక్షణ కోసమేనని స్పష్టం చేస్తూ, అమరావతి అంశంపై బహిరంగ చర్చకు రావాలని ఏబీకి సవాల్ విసిరారు.ఏబీ వెంకటేశ్వరరావు తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యాలతో నిండి ఉన్నాయని బొలిశెట్టి మండిపడ్డారు. వైసీపీ ప్రోద్బలంతో తాను అమరావతిపై కేసులు వేశాననడానికి ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు. తాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసింది 2015-17 మధ్య కాలంలో అని, అప్పుడు వైసీపీ అధికారంలోనే లేదని గుర్తుచేశారు. వాయిదా కోసం రూ.20 లక్షలు తీసుకున్నానన్న ఆరోపణకు సాక్ష్యం చూపాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి, అప్పటి టీడీపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల విషయంలో నిబంధనలను అతిక్రమించిందని, 1.5 లక్షల చదరపు మీటర్ల ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతికి బదులుగా రాష్ట్ర స్థాయి కమిటీతో సరిపెట్టిందని ఆరోపించారు.తాను ఎన్జీటీలో కేసు వేయడమనేది రాజధానిని అడ్డుకోవడానికి కాదని, అప్పటి ప్రభుత్వం స్వయంగా ఇచ్చిన పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక లోని అంశాలనే అమలు చేయాలని కోరడానికేనని బొలిశెట్టి వివరించారు. కృష్ణా నది వరద మైదానాలను, కొండవీటి వాగును కాపాడాలని ఎన్జీటీ ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. తాను విశాఖ వాసినైనప్పటికీ అక్కడ రాజధాని వద్దని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, తనది ప్రాంతాలకతీతమైన పర్యావరణ పోరాటమని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల తప్పులను వ్యతిరేకించానని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు చేసినా ప్రకృతి సంపదను కాపాడటానికి ఎదిరిస్తానని ఉద్ఘాటించారు.ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావుపై వ్యక్తిగత విమర్శలు కూడా చేసిన బొలిశెట్టి, ఆయన సర్వీసులో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలను బయటపెడతానని హెచ్చరించారు. అమరావతిపై చర్చకు వచ్చే ముందు దాని చరిత్ర, పర్యావరణ నివేదికలు, ఎన్జీటీ తీర్పులను అధ్యయనం చేయాలని సూచిస్తూ, ఆ పత్రాలను తన పోస్ట్‌కు జతచేశారు. సమయం, వేదిక మీరే ఎంచుకోవాలని, పార్టీలకు అతీతంగా పర్యావరణ పరిరక్షణ కోసం నిజాలు మాట్లాడదాం రండి అంటూ ఏబీకి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa