రాష్ట్రంలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన నిర్మాణాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో 10 జిల్లాలను ఉద్యాన కేంద్రాలుగా మార్చే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అనేక ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టిందని ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, 10 జిల్లాల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. తక్కువ నిధులతో త్వరగా పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గాలేరు-నగరి ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారించాలన్నారు. మొత్తంగా 20కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు, మరో 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీరందించవచ్చని అధికారులు సీఎంకు వివరించారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ప్రాజెక్టులు చేపట్టాలని, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయితే గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్లి, పోలవరం-వంశధార నదుల అనుసంధానం చేపట్టవచ్చని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను పండించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లు, 303 మండలాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్లలో ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. దుబాయ్‌కి చెందిన డీపీ వరల్డ్ సంస్థ ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం వెల్లడించారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన గ్రామీణ రహదారుల నెట్‌వర్క్, లాజిస్టిక్స్, మార్కెట్, గ్లోబల్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.ఈ బృహత్తర ప్రణాళికల అమలుకు పూర్వోదయ, సాస్కీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పోర్ట్ కనెక్టివిటీ, గోదాములు, కోల్డ్ చైన్ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa