ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USA T20 Squad 2026: వరల్డ్ కప్ ఆశలు.. భారతీయ కెప్టెన్‌పై భారం

sports |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 08:26 PM

టీ20 వరల్డ్ కప్ సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు తమ తుది స్క్వాడ్లను ప్రకటించాయి. తాజాగా, మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటాలనే లక్ష్యంతో అమెరికా జట్టు కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టుకు మోనాంక్ పటేల్ నాయకత్వం వహించనున్నాడు. విశేషమేంటంటే, గత ప్రపంచకప్‌లో పాల్గొన్న 15 మంది ఆటగాళ్లలో 10 మంది ఈసారి కూడా స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. గత అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలన్నదే అమెరికా వ్యూహంగా స్పష్టంగా కనిపిస్తోంది.ఈ జట్టులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే—అమెరికా జట్టు కెప్టెన్ భారతీయ సంతతికి చెందినవాడు కావడం. కెప్టెన్ మోనాంక్ దిలీప్‌భాయ్ పటేల్ భారతదేశంలో జన్మించిన అమెరికన్ క్రికెటర్. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన మోనాంక్, వికెట్‌కీపర్‌గా 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచీ అమెరికన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.అతని నాయకత్వంలోనే USA జట్టు 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై గ్రూప్‌ స్టేజ్‌లో చారిత్రాత్మక విజయం సాధించింది. ఆ విజయంతో పాటు పలు మైలురాయి ఘనతలను కూడా అమెరికా ఖాతాలో వేసుకుంది.అయితే, ఈ ప్రపంచకప్‌లో అమెరికాకు తొలి మ్యాచ్‌నే అతిపెద్ద సవాలుగా మారనుంది. ముంబయిలో జరిగే ఆరంభ మ్యాచ్‌లోనే ఆతిథ్య దేశం, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్‌తో అమెరికా తలపడనుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా, గత ఏడాది అమెరికా క్రికెట్ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో సెప్టెంబర్ 23న ఐసీసీ, యూఎస్‌ఏ క్రికెట్‌ను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి జట్టు ఎంపిక ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఐసీసీతో పాటు యూఎస్ ఒలింపిక్ అండ్ ప్యారాలింపిక్ కమిటీ కలిసి ఒక కొత్త, పారదర్శక ఎంపిక విధానాన్ని రూపొందించింది. పూర్తిగా ప్రతిభ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.గత ప్రపంచకప్‌లో అమెరికా చేసిన ప్రదర్శనను క్రికెట్ ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. పూర్తి సభ్య దేశమైన పాకిస్థాన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అమెరికా, సూపర్ ఎయిట్ దశకు కూడా చేరింది. అదే ఆత్మవిశ్వాసంతో ఈసారి కూడా టోర్నీలో అడుగుపెడుతోంది.
*అమెరికా జట్టు:మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, సౌరభ్ నేత్రవల్కర్, మోహమ్మద్ మొహీబ్ ఖాన్, రంజన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa