ఈ ఆదివారం యావత్ భారతదేశం దృష్టి పార్లమెంట్ వైపే నిలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా బడ్జెట్‌ను పనిదినాల్లో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్నా, ఈసారి ఆ సంప్రదాయానికి భిన్నంగా ఫిబ్రవరి 1, 2026న ఆదివారం రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషంగా మారింది.ఈ అరుదైన నిర్ణయం వెనుక స్పష్టమైన ఆర్థిక వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల స్టాక్ మార్కెట్లు, ఆర్థిక నిపుణులకు బడ్జెట్ ప్రతిపాదనలను లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. తద్వారా సోమవారం మార్కెట్లు ప్రారంభమయ్యే నాటికి ఇన్వెస్టర్లు స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లే వీలుంటుంది. ఈ మార్పుపై పెట్టుబడిదారులు సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నారు.బడ్జెట్ చరిత్రను పరిశీలిస్తే గత దశాబ్ద కాలంలో అనేక పాత సంప్రదాయాలకు తెరపడినట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విధానంలో కీలక మార్పులు చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చేలా బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చగా, సమయాన్ని ఉదయం 11 గంటలకు సవరించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన ఆదాయ–వ్యయ అంచనాలను పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. రాజ్యాంగ భాషలో దీనినే వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొంటారు. ఇది దేశ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే అత్యంత కీలక పత్రంగా భావిస్తారు.ఈసారి బడ్జెట్‌పై ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదాయపు పన్ను రాయితీల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గత బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు కల్పించిన విషయం తెలిసిందే.అయితే ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిమితిని మరింత పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, 80C పరిమితి సవరణ, ఆరోగ్య బీమా ప్రీమియాలపై అదనపు పన్ను మినహాయింపులు వంటి అంశాలపై కూడా పన్ను చెల్లింపుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుడి జేబుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు వస్తాయా లేదా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.ఆర్థిక సర్వే 2025–26 ప్రకారం దేశ వృద్ధిరేటు 6.8 శాతం నుంచి 7.2 శాతం మధ్య ఉండే అవకాశముందని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. భారత్‌పై ప్రపంచానికి విశ్వాసం ఉందని, దేశం గ్లోబల్ ఎకానమీలో ఆశాకిరణంగా నిలుస్తోందని ప్రధాని మోదీ ఇప్పటికే వ్యాఖ్యానించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సామాజిక న్యాయం, ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రత రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. వికసిత భారత్–2047 లక్ష్య సాధనకు ఈ బడ్జెట్ బలమైన పునాదిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.11 లక్షల కోట్ల వరకు కేటాయింపులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మొత్తంగా చూస్తే, ఆదాయపు పన్ను రాయితీలు, అభివృద్ధి వ్యయాలు, మధ్యతరగతి ఆశలు.ఈ మూడింటికీ సమతుల్యత సాధించేలా ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపుదిద్దుకోనుందని అంచనాలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa