ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యోగి, శంకరాచార్య వివాదానికి ముగింపు పడినట్లేనా?

national |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 08:24 PM

మాఘ మేళా సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, జోషిమఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి మధ్య తలెత్తిన వివాదానికి ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. శంకరాచార్యకు ఉత్తర్ ప్రదేశ్ అధికార యంత్రాంగం క్షమాపణలు చెప్పడానికి సిద్దంగా ఉన్నట్టు స్వామీజీ సన్నిహితుడు తెలిపారు. జనవరి 18న మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌ మాఘమేళాకు తన అనుచరులతో పవిత్ర సంగమానికి వచ్చిన స్వామీజీని అడ్డుకుని, రథం దిగి నడిచి వెళ్లాలని చెప్పడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని, దానిని నివారించడానికే శంకరాచార్యను రథం దిగి మిగతా వారి మాదిరిగా నడిచి వెళ్లాలని సూచించినట్టు అధికారులు పేర్కొన్నారు.


తనను అవమానించారని ఆరోపిస్తూ శంకరాచార్య పవిత్ర సంగం వద్దే నిరసనకు దిగి, పవిత్ర స్నానం చేయకుండానే బుధవారం ప్రయాగ్‌రాజ్ విడిచి వెళ్లారు. అంతేకాదు, ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. మాఘ మేళాను విడిచిపెట్టి వారణాసికి వెళ్లాలన్న శంకరాచార్య నిర్ణయంతో అధికారులు ఆశ్చర్యపోయారని ఆయన మీడియా ఇంఛార్జ్ యోగిరాజ్ సర్కార్ తెలిపారు.


‘శంకరాచార్యులు అకస్మాత్తుగా మాఘ మేళాను విడిచిపెట్టి వారణాసికి వెళ్తారని ప్రయాగ్‌రాజ్ అధికారులు ఊహించలేదు. ఆయన మాఘ పూర్ణిమ నాడు, అంటే ఫిబ్రవరి 1వ తేదీన స్నానం చేసిన తర్వాత బయలుదేరతారని, అప్పటిలోగా తాము ఆయనను ఒప్పించగలమని వారు భావించారు’ అని సర్కార్ అన్నారు. అవిముక్తేశ్వరానంద సరస్వతి వారణాసికి వచ్చిన తర్వాత లక్నో నుంచి ఇద్దరు సీనియర్ అధికారులు వచ్చి ఆయనను కలిసి, తిరి మాఘమేళాకు రావాల్సిందిగా అభ్యర్ధించారు. ఇందుకు శంకరాచార్య స్పందిస్తూ.. ఘటనకు కారకులైన అధికారులు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పడం సహా రెండు షరతులు విధించారు. అంతేకాదు, నలుగురు శంకరాచార్యుల విషయంలోనూ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని డిమాండ్ చేశారు.


సీనియర్ అధికారుల సమక్షంలో రథంతో సంగం వద్దకు తీసుకెళ్లడానికి కూడా ముందుకొచ్చినట్టు ఆయన పేర్కొన్నారు, కానీ ఆయన హృదయం దుఃఖం, కోపంతో నిండిపోయినందున ఆ ప్రతిపాదనను తిరస్కరించానని ఆయన అన్నారు. ఈ వారం ప్రారంభంలో శంకరాచార్య, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య జరిగిన ఘర్షణకు ఇప్పుడు క్షమాపణ చెప్పడం ద్వారా ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నారు.


శంకరాచార్య పేరు ప్రస్తావించకుండానే రామాయణంలోని ఒక రాక్షసుడు హనుమంతుడిని మోసగించడానికి సాధువుగా వేషం వేసుకున్నాడని, ప్రజలు అలాంటి ‘కాలనేమి’ పట్ల జాగ్రత్తగా ఉండాలని అదిత్యనాథ్ హెచ్చరించారు. దీనిపై స్వామిజీ ఘాటుగానే స్పందిస్తూ.. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు రాజకీయ నాయకుడని, మతపరమైన విషయాలను తనలాంటి సాధువులకు వదిలివేయాలని శంకరాచార్య సూచించారు.


ఉత్తరప్రదేశ్‌ అధికారులపై కూడా ఈ వివాదం ప్రభావం చూపింది. అయోధ్యలో డిప్యూటీ జీఎస్టీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఒక సీనియర్ అధికారి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోదీ, ఇతరులకు జరిగిన ‘అవమానాన్ని’ తాను సహించలేనని పేర్కొంటూ తన పదవికి రాజీనామా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa