వెనిజులాలో నెలకొన్న రాజకీయ మార్పుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెనిజులాపై ఉన్న ఆర్థిక ఆంక్షలను భారీగా సడలిస్తూ.. అమెరికన్ చమురు కంపెనీలు అక్కడ యథేచ్ఛగా కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ గురువారం 'జనరల్ లైసెన్స్'ను జారీ చేసింది. మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే లక్ష్యంతో వైట్ హౌస్ ఈ అడుగు వేసింది.
ఈ కొత్త లైసెన్స్ ప్రకారం.. అమెరికన్ కంపెనీలు వెనిజులా ముడి చమురును ఎగుమతి చేయడం, అమ్మడం, నిల్వ చేయడం, శుద్ధి చేయడం వంటి కీలక పనులను చేపట్టవచ్చు. గతంలో వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ 'PDVSA'తో వ్యాపార సంబంధాలపై ఉన్న నిషేధాన్ని ఈ ఉత్తర్వుల ద్వారా ఎత్తివేశారు. అయితే ప్రస్తుతం భూగర్భం నుంచి చమురును వెలికితీసే ప్రక్రియకు మాత్రం పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం వెనిజులాలో కేవలం 'షెవ్రాన్' సంస్థ మాత్రమే ప్రత్యేక లైసెన్స్‌తో ఉత్పత్తిని కొనసాగిస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం ఈ లైసెన్స్‌లో కొన్ని కఠినమైన షరతులను కూడా విధించింది. ముఖ్యంగా చైనాకు సంబంధించిన సంస్థలతో ఎలాంటి లావాదేవీలు జరపకూడదని నిషేధం విధించింది. మదురో హయాంలో వెనిజులా చమురును చైనా తక్కువ ధరకే కొనుగోలు చేసేది. ఇప్పుడు ఆ మార్గాన్ని మూసేస్తూ.. వెనిజులా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం అమెరికా నియంత్రణలో ఉండే ఖాతాలలోనే జమ కావాలని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. దీనివల్ల వెనిజులా చమురు సంపదపై అమెరికాకు పరోక్ష నియంత్రణ లభించనుంది.
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ విదేశీ చమురు సంస్థలకు రాయితీలు, తక్కువ పన్నులు, ప్రైవేట్ రంగ నియంత్రణ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించారు. దీనికి తోడు వెనిజులా పార్లమెంట్ ఇటీవల హైడ్రోకార్బన్ పాలసీలో చారిత్రాత్మక సంస్కరణలు చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. అమెరికన్ ఎనర్జీ కంపెనీలు వెనిజులాలో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ముందున్న సవాళ్లు..
ఏళ్ల తరబడి సాగిన అవినీతి, నిర్వహణ లోపం వల్ల వెనిజులాలోని చమురు మౌలిక సదుపాయాలు పూర్తిగా శిథిలం అయ్యాయి. వాటిని పునరుద్ధరించడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. అలాగే ఈ లైసెన్స్ ప్రకారం జరిగే ప్రతి లావాదేవీపై యూఎస్ ట్రెజరీ శాఖకు వివరణాత్మక నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఏవైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే వాటిని అమెరికా కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలనే నిబంధనను కూడా ప్రభుత్వం చేర్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa