ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ తండ్రి సమానంగా భావించిన వ్యక్తి ఎవరు?

international |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 08:48 PM

టాలీవుడ్‌లో విజయా ప్రొడక్షన్స్‌కు ఉన్న ఘనమైన చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సంస్థ నిర్మించిన సినిమాలే తెలుగు చిత్రసీమకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. విజయా సంస్థలో రూపొందిన చిత్రాలు ఘన విజయం సాధించడంతోనే ఎన్టీఆర్ ఒక స్టార్‌గా ఎదిగి, తెలుగు ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకున్నారు.“నా జీవితాన్ని తీర్చిదిద్దిన సంస్థ విజయా ప్రొడక్షన్స్. సినిమా నిర్మాణంలో విలువలు ఏంటో నేర్చుకున్నది, నటుడిగా నేను ఎదిగింది ఆ సంస్థ నీడలో గడిపిన రెండేళ్ల కాలంలోనే” అని ఎన్టీఆర్ ఎప్పుడూ కృతజ్ఞతతో చెప్పేవారు. 1949 నుంచే విజయా సంస్థతో ఆయనకు అనుబంధం మొదలైంది. మన దేశం చిత్రంతో ఎన్టీఆర్‌కు గుర్తింపు వచ్చినప్పటికీ, ఆయన హీరోగా నటించిన తొలి సినిమా పల్లెటూరి పిల్ల. అయితే, అంతకుముందే విజయా సంస్థ నిర్మించిన షావుకారు చిత్రం 1949 నవంబర్ 5న విడుదలైంది.షావుకారు కమర్షియల్ విజయం సాధించకపోయినా, నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి వెనకడుగు వేయలేదు. వరుసగా నాలుగు సినిమాలు తీయాలనే నిర్ణయంతో తొలి చిత్రంగా పాతాళభైరవిని ఎంపిక చేశారు. దర్శకుడిగా కె.వి.రెడ్డిని నియమించి, తమ తొలి చిత్రంలో నటించిన ఎన్టీఆర్‌ను మళ్లీ హీరోగా తీసుకున్నారు. రెండేళ్ల పాటు విజయా సంస్థ నిర్మించే సినిమాల్లో మాత్రమే నటించాలన్న ఒప్పందం కుదిరింది. బయట సినిమాల్లో నటించకూడదన్న షరతును ఎన్టీఆర్ అంగీకరిస్తూ, నాలుగు సినిమాల్లో తననే హీరోగా తీసుకోవాలన్న డిమాండ్ పెట్టారు. దీనికి నాగిరెడ్డి, చక్రపాణిలు ఒప్పుకున్నారు.అయితే దర్శకుడు కె.వి.రెడ్డి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే బాలరాజు, కీలుగుర్రం వంటి చిత్రాలతో ఏఎన్ఆర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని, కొత్త హీరోతో జానపద సినిమా తీయడం రిస్క్ అని ఆయన భావించారు. అయినప్పటికీ నిర్మాతలు తమ నిర్ణయంపై నిలబడ్డారు. విజయా సంస్థ ఒప్పందం ప్రకారం, ఎన్టీఆర్‌కు తొలి ఏడాది నెలకు రూ.500 జీతం, సినిమా పూర్తయ్యాక రూ.5,000 పారితోషికం ఇచ్చారు. రెండో ఏడాది నెలకు రూ.750, సినిమాకు రూ.7,500 చెల్లించారు.పాతాళభైరవి నిర్మాణ సమయంలో ఎన్టీఆర్ సన్నగా ఉండటాన్ని గమనించిన నాగిరెడ్డి, చక్రపాణిలు వ్యాయామం చేసి శరీరం పెంచుకోవాలని సూచించారు. దాంతో ఎన్టీఆర్ ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకు వాహిని స్టూడియోకి వెళ్లి రెండు గంటల పాటు కర్రసాము, కత్తి పోరాటం సాధన చేసేవారు. ఒకరోజు నాగిరెడ్డి దగ్గరకు వెళ్లి, “క్యాంటీన్‌లో ఇచ్చే టిఫిన్ నాకు సరిపోవడం లేదు. ఎక్కువగా వ్యాయామం చేస్తున్నాను, చాలా ఆకలి వేస్తోంది. ఇంకో రెండు ఇడ్లీలు పెడితే చెప్పగలరా?” అని వినయంగా అడిగారు. దానికి నాగిరెడ్డి, “మీకు కావలసినవి మీరు అడిగి తీసుకోండి” అని ఆప్యాయంగా చెప్పారు. ఆ సంఘటనతో వారి మధ్య అనుబంధం మరింత బలపడింది.ఎన్టీఆర్ చక్రపాణిని “చక్కన్న”గా, నాగిరెడ్డిని “నాన్నగారు”గా ప్రేమతో పిలిచేవారు. నాగిరెడ్డి, చక్రపాణిలు కూడా ఎన్టీఆర్‌ను తమ కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. పాతాళభైరవి అనేక కేంద్రాల్లో వంద రోజులు ఆడడంతో, ఆ సినిమాలో నటించిన ఎన్టీఆర్, ఎస్వీఆర్, రేలంగిలకు బ్యూక్ కార్లను బహుమతిగా ఇచ్చారు. ఆ రోజుల్లో ఒక్కో కారు ధర సుమారు రూ.6,000. “మా నాన్నగారు ఇచ్చిన కారు” అని ఎన్టీఆర్ ఆ కారును ఎంతో కాలం ఎంతో జాగ్రత్తగా సంరక్షించారు.1952లో విజయా సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత, నాగిరెడ్డి “ఇక మీరు ఇతర సినిమాల్లో నటించవచ్చు” అని చెప్పగానే, ఎన్టీఆర్ “కాల్‌షీట్ల కోసం ఎవరు వచ్చినా, విజయా వారు పిలిస్తే మాత్రం వెంటనే వెళ్లిపోతాను” అని స్పష్టంగా చెప్పారు. ఆ మాటకు జీవితాంతం కట్టుబడ్డారు. కథ ఏమిటి, దర్శకుడు ఎవరు అనే ప్రశ్నలు లేకుండానే విజయా వారు పిలిస్తే వెంటనే డేట్స్ ఇచ్చేవారు.మాయాబజార్ విడుదల సమయంలో కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ క్యాలెండర్లను 40 వేల సంఖ్యలో ముద్రించి విక్రయించారు. ప్రజలు వాటిని ఫ్రేమ్ కట్టించుకుని ఇళ్లలో ఉంచుకున్నారు. కొందరైతే పూజగదుల్లో పెట్టుకుని పూజలు కూడా చేసేవారు. విజయా సంస్థతో సినిమాలు చేయకపోయినా, నాగిరెడ్డి, చక్రపాణిలతో ఎన్టీఆర్ అనుబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగింది.1983లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు రోజు నాగిరెడ్డిని హైదరాబాద్‌కు పిలిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయనను తనతో పాటు సెక్రటేరియట్‌కు తీసుకెళ్లి, తన కుర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా నిలబడి.“ఒకప్పుడు మీరు ఇచ్చిన చేయూత వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. ఈ విజయం మీదే. ఈ రాజ్యం మీదే. నా చేత మంచి పాలన చేయించండి” అంటూ చేతులు జోడించారట. ఆ క్షణంలో ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగిన నాగిరెడ్డి, ఎన్టీఆర్‌ను హృదయపూర్వకంగా కౌగలించుకున్నారు. ఇది వారి మధ్య ఉన్న అపూర్వమైన బంధానికి నిదర్శనంగా సినీ వర్గాలు ఇప్పటికీ చెప్పుకుంటుంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa