ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాకు చెక్ పెట్టేందుకు భారత్‌‌పై‌ దృష్టి సారించిన అమెరికా

international |  Suryaa Desk  | Published : Fri, Jan 30, 2026, 09:25 PM

చైనాను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్న అమెరికా.. భారత‌్‌పై దృష్టి సారించే ఓ పెద్ద సమావేశాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. భారత‌్‌పై ప్రత్యేక దృష్టి సారించేందుకు వచ్చె నెలలోనే కాంగ్రెస్‌కు చెందిన అమెరికా-చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్  మొదటి బహిరంగ విచారణ నిర్వహించనుంది. అమెరికా, భారత్, చైనాల మధ్య సంబంధాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అధికార సమతౌల్యత వంటి అంశాలపై ఈ సమావేశం చర్చిస్తుంది. ఈ సమావేశం ఫిబ్రవరి 17న జరగనుంది. భారత్, చైనా, అమెరికాల మధ్య భౌగోళిక, సైనిక అంశాలను ఇది పరిశీలిస్తుంది. సరిహద్దు వివాదాలు, హిందూ మహాసముద్రంలో ప్రాప్యత, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ పాత్ర వంటి అంశాలు ఇందులో ఉంటాయి.


 అలాగే, భారత్-చైనా మధ్య ఆర్థిక, సాంకేతిక సంబంధాలను కూడా ఈ కమిషన్ పరిశీలిస్తుంది. వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధస్సు,సెమీకండక్టర్లు, ఔషధ సరఫరా గొలుసులు వంటి కీలక రంగాలలో భారత్ స్వావలంబన సాధించే ప్రయత్నాలపై కూడా ఇందులో చర్చిస్తారు. భారత్- చైనా సంబంధాలతో పాటు, న్యూఢిల్లీతో వాషింగ్టన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను కూడా ఈ విచారణ సమీక్షిస్తుంది. న్యూఢిల్లీ- బీజింగ్ సంబంధాలు అమెరికా ఆర్థిక, భద్రతా ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా చర్చిస్తారు.


విచారణ సమయం ప్రాముఖ్యత


భారత్- చైనా‌లు తమ ఆర్థిక వ్యవస్థను ‘దశలవారీగా’ తెరవాలని యోచిస్తున్న సమయంలో ఈ విచారణ జరుగుతుండటం చెప్పుకోదగ్గ పరిణామం. చైనా నుంచి ఏదైనా సడలింపు ఉంటేనే భారత్ కూడా అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తుంది. 2020 గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఐదేళ్లు ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి. అయితే, ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక పర్యటనల తర్వాత ఈ సంబంధాలు పునరుద్దరణ మొదలైంది.


అక్టోబరు 2024న రష్యాలోని కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు ప్రత్యేక భేటీ తర్వాత ఈ సంబంధాల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. అనంతరం ప్రధాని మోదీ ఏడేళ్ల తర్వాత గతేడాది చైనాను సందర్శించారు. అప్పటి నుంచి బీజింగ్, న్యూఢిల్లీ తమ విభేదాలను పరిష్కరించుకోవడానికి చర్చలు, సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. తత్ఫలితంగా ఐదేళ్లుగా నిలిచిపోయిన విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. భారత్ కూడా చైనా కంపెనీలను పెట్టుబడులు, ప్రభుత్వ కొనుగోళ్లలో తిరిగి అనుమతించే చర్యలు చేపట్టింది.


ట్రంప్ చైనా పర్యటన:


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు కొద్ది వారాల ముందు ఈ కమిషన్ విచారణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది బీజింగ్, వాషింగ్టన్ మధ్య సున్నితమైన దౌత్యపరమైన సమతౌల్యతను సూచిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య దెబ్బతిన్న సంబంధాలు ఇటీవల గణనీయంగా మెరుగుపడ్డాయని, చైనా పెద్ద మొత్తంలో అమెరికా సోయాబీన్‌లను కొనుగోలు చేస్తోందని ట్రంప్ తెలిపారు.


ఏంటీ చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్వూ కమిషన్?


అమెరికా-చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ అనేది కాంగ్రెస్ 2000 అక్టోబర్‌లో ఏర్పాటు చేసిన ఒక ద్వైపాక్షిక లెజిస్లేటివ్ కమిషన్. అమెరికా, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రతాపరమైన ప్రభావాలను పర్యవేక్షించడం, పరిశోధించడం, నివేదించడం దీని లక్ష్యం. గత దశాబ్దంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వాషింగ్టన్ భారత్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. భారత్ వ్యూహాత్మక స్థానం, సైనిక సామర్థ్యాలు ఆసియా అంతటా చైనా ప్రభావాన్ని పరిమితం చేసే అమెరికా ప్రయత్నాలలో కీలక పాత్ర పోషిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa