ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న పయ్యావుల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 07:21 PM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కల్తీ వ్యవహారానికి పునాది వేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు.2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే టీటీడీ నెయ్యి సరఫరా నిబంధనలను అనర్హులకు అనుకూలంగా మార్చారని పయ్యావుల ఆరోపించారు. గతంలో సరఫరాదారులకు ఉండాల్సిన రూ.250 కోట్ల టర్నోవర్‌ను రూ.150 కోట్లకు, మూడేళ్ల అనుభవాన్ని ఏడాదికి తగ్గించి కల్తీకి తలుపులు తెరిచారని విమర్శించారు. 2022లోనే నెయ్యి నాణ్యతపై అనుమానంతో మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్  కి పంపగా, అందులో జంతు అవశేషాలున్నట్లు నివేదిక వచ్చిందని తెలిపారు. కానీ, నాటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆ నివేదికను తొక్కిపెట్టి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.240 కోట్ల అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. నాటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న ఈ కల్తీ కథలో కీలక వ్యక్తి అని, అతడు లీటరుకు రూ.25 చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు సిట్ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. చిన్న అప్పన్న ఖాతాకు నేరుగా రూ.4 కోట్లు బదిలీ అయ్యాయని, దీని వెనుక ఉన్న పెద్ద తలలు ఎవరో తేలాల్సి ఉందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ ప్రక్షాళన చేపట్టామని పయ్యావుల వివరించారు. నెయ్యి నమూనాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్  కు పంపగా, అందులో జంతువుల కొవ్వు కలిసినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. సిట్ చార్జ్‌షీట్‌లోని 35వ పేజీలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందని చెప్పారు. ఇంత స్పష్టమైన నివేదికలు ఉండగా, వైసీపీ నేతలు తమకు క్లీన్‌చిట్ వచ్చిందంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు."దేవుడి విషయంలో తప్పు చేసి పశ్చాత్తాపం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారు. మీకు జైళ్లు, బెయిళ్లు కొత్త కాదు, వాటిపై సంబరాలు చేసుకోండి కానీ, స్వామివారి విషయంలో అబద్ధాలు ఆడకండి" అని పయ్యావుల హితవు పలికారు. తిరుమల పవిత్రతను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నుంచి తిరిగి వచ్చాక, ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa