తెలుగుదేశం పార్టీ అనుకూల పచ్చ మీడియా తనపై కావాలనే తప్పుడు, అసత్య కథనాలు ప్రచారం చేస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వెంకటాచలం మండల కేంద్రంలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.తనతో పాటు తన అనుచరులపై రూ.53 కోట్ల పెనాల్టీ విధించారంటూ కొన్ని పచ్చ పత్రికలు చంద్రమోహన్ రెడ్డి ప్రోద్బలంతో పూర్తిగా అబద్ధపు వార్తలు రాశాయని, అందులో నిజం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. మైనింగ్ శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసులు, డిమాండ్ నోటీసులను హైకోర్టు పూర్తిగా కొట్టివేసిందని గుర్తుచేశారు.విజిలెన్స్ శాఖ అస్తవ్యస్తంగా ఇచ్చిన నివేదిక ఆధారంగా తూతూమంత్రంగా ఇచ్చిన నోటీసులకు ఎలాంటి విలువ లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఏవైనా ఆధారాలు ఉంటే ముందుగా సంబంధిత వ్యక్తులకు అందించి, వారి వివరణ తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించిందన్నారు.తిరుమల లడ్డూ ప్రసాదంలో లేని జంతు కొవ్వును ఉన్నట్టు సృష్టించి తనపై కావాలనే తప్పుడు వార్తలు రాయించారని ఆరోపించారు. విజిలెన్స్ నివేదికలో చవ్వా చంద్రబాబు నాయుడు అక్రమంగా గ్రావెల్ తరలించినట్టు స్పష్టంగా ఉన్నప్పటికీ, ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినవాడన్న కారణంతో మైనింగ్ శాఖ నోటీసులు ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు.వైయస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కూడా చవ్వా చంద్రబాబు నాయుడే గ్రావెల్ తరలించినట్టు విజిలెన్స్ ఆధారాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పారని కాకాణి గుర్తు చేశారు. అయినప్పటికీ చవ్వా చంద్రబాబు నాయుడు తన అనుచరుడని సోమిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, తనను ఆ వ్యక్తి చూసినట్టు గానీ, కలిసినట్టు గానీ ఎలాంటి ఆధారాలు లేవన్నారు.2014 నుంచి 2019 వరకు సోమిరెడ్డి ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉన్న సమయంలో దోచుకున్న గ్రావెల్ గుంటలను చూపించి, గ్రావెల్ తరలించిన అసలు నిందితుడి పేరును విజిలెన్స్ రిపోర్ట్ నుంచి తొలగించి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చేర్చడం ఘోరమని ఆరోపించారు. అధికారుల కక్షపూరిత చర్యలను కోర్టు కొట్టివేయడమే దీనికి నిదర్శనమన్నారు.“హైకోర్టు తీర్పు మీకు చెంపపెట్టు లాంటిది. మాపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అన్నీ వీగిపోతాయి. మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరికీ 53 రూపాయలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేశారు. తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa