ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిబియా మాజీ నియంత గడాఫీ కుమారుడి దారుణ హత్య.

international |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 08:48 PM

లిబియా మాజీ నియంత ముఅమ్మర్ గడాఫీ కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ముఖ్యంగా గడాఫీ పతనం తర్వాత ఆ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నించిన ఆయన కుమారుడు.. 53 ఏళ్ల సయిఫ్‌ అల్‌ ఇస్లాం గడాఫీని పలువురు దుండగులు కాల్చి చంపారు. నేరుగా జింటాన్‌ నగరంలో ఉన్న ఆయన ఇంట్లోకి చొరబడి మరీ.. గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ ఆయనను కాల్చి చంపారు. 2011 నాటి ప్రజా విప్లవం తర్వాత పదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఇటీవలే బయటకు వచ్చి రాజకీయాల్లో ఎదురులేని శక్తిగా ఎదగాలనుకున్న ఈ సమయంలోనే హత్యకు గురికావడం సంచలనంగా మారింది.


అసలేం జరిగిందంటే..?


జింటాన్‌లోని సయిఫ్‌ అల్‌ ఇస్లాం నివాసంపై అత్యంత ప్రణాళిక బద్ధంగా ఈ దాడి జరిగింది. ముఖ్యంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నలుగురు ముసుగు వేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే అక్కడి సీసీటీవీ కెమెరాలను పగులగొట్టేశారు. అనంతరం లోపలికి వెళ్లి సయిఫ్‌ అల్‌ ఇస్లాంను తుపాకులతో కాల్చి చంపారు. ఈ విషయాన్ని ఆయన ఫ్రెంచ్ న్యాయవాది మార్సెల్ సెకాల్డి, ఆయన రాజకీయ సలహాదారు అబ్దుల్లా ఉస్మాన్ అబ్దుల్ రహీంలు అధికారికంగా ధృవీకరించారు.


సయిఫ్‌ అల్‌ ఇస్లాం ప్రాణాలకు ముప్పు ఉందని గత కొన్ని రోజులుగా ఆయన భద్రతా బృందానికి సమాచారం అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గడాఫీ తెగకు చెందిన పెద్దలు ఆయనకు అదనపు భద్రతను పంపిస్తామని ప్రతిపాదించినప్పటికీ.. సయిఫ్ దానిని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ భద్రతా వైఫల్యాన్నే ఆసరాగా చేసుకున్న ముఠా.. అతి సులువుగా ఆయన నివాసంలోకి చొరబడి హత్యను అమలు చేసింది. అయితే ఈ దాడి వెనుక ఏ ముఠా ఉందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.


వారసుడిగా మొదలై.. విప్లవంతో పతనం వరకు


ముఅమ్మర్ గడాఫీ బతికున్న కాలంలో సయిఫ్‌ అల్‌ ఇస్లాంను ఆయన రాజకీయ వారసుడిగా భావించేవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్న ఆయనను.. తొలినాళ్లలో సంస్కరణవాదిగా చెప్పుకునేవారు. కానీ 2011 అరబ్ స్ప్రింగ్ విప్లవ సమయంలో నిరసనకారులను ఎలుకలుగా అభివర్ణించి, రక్తపు ఏరులు పారిస్తామని హెచ్చరించడంతో ఆయన ప్రతిష్ట దెబ్బతింది. గడాఫీ హత్య తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో జింటాన్ మిలిషియాకు పట్టుబడ్డారు. అప్పట్లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. ట్రిపోలీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. కానీ 2017లో ఆయన అమ్నెస్టీ కింద విడుదల అయ్యారు.


సయిఫ్‌ అల్‌ ఇస్లాం మరణం లిబియా రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో గడాఫీ మద్దతుదారులు అందరూ ఏకమయ్యారు. కానీ ఆ ఎన్నికలు వాయిదా పడటంతో ఆయన అప్పటి నుంచి జింటాన్‌‌లోనే ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన్ను ఎవరో చంపేయడంతో.. ఎన్నికల ప్రక్రియలో ఒక బలమైన అభ్యర్థి తప్పుకున్నట్లు అయింది. మరోవైపు ఆయన మరణంపై గడాఫీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. దీనివల్ల లిబియాలో మళ్లీ అంతర్గత కల్లోలాలు మొదలయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


న్యాయ విచారణకు డిమాండ్


ఈ హత్యను పిరికిపంద చర్యగా అభివర్ణించిన సయిఫ్ రాజకీయ బృందం.. దీనిపై అంతర్జాతీయ విచారణ జరగాలని డిమాండ్ చేస్తోంది. లిబియా అటార్నీ జనరల్ కార్యాలయం ఇప్పటికే ఈ ఘటనపై అధికారిక దర్యాప్తును ప్రారంభించింది. 444 కాంబాట్ బ్రిగేడ్ వంటి సాయుధ సంస్థలు ఈ హత్యలో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa