ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్ పర్యటనలో అపశ్రుతి.. ఓ వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 08:03 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కన్నుమూశారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అయితే వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ వైసీపీ కార్యకర్త అనుకోకుండా ప్రాణాలు కోల్పోయారు. చిల్లకల్లు గ్రామానికి చెందిన రాంబాబు అనే 45 ఏళ్ల వైసీపీ నాయకుడు.. ప్రాణాలు కోల్పోయారు. జోగి రమేష్‌ ఇంటికి సమీపంలో ఈ ఘటన జరిగింది. వైఎస్ జగన్ వస్తున్నారని.. వైసీపీ చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు రాంబాబు.. మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటికి బయల్దేరారు. అయితే మధ్యలో రాంబాబు పల్స్‌ పడిపోవటంతో కుప్పకూలారు. పక్కన ఉన్న వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రాంబాబు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.


వైసీపీ కార్యకర్త మృతి .. అసలేం జరిగిందంటే..


మరోవైపు వైఎస్ జగన్ పర్యటనలో అపశ్రుతి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాంబాబు అనే కార్యకర్త చనిపోవటంపై జగ్గయ్యపేట వైసీపీ ఇంఛార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు స్పందించారు. వైసీపీ నాయకుడి మృతిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్‌ను చూసేందుకు చిల్లకల్లుకు చెందిన డి. రాంబాబు తన ఊరివారితో కలిసి ఇబ్రహీంపట్నం వచ్చినట్లు తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. అయితే మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో.. రోడ్డుమీద కుప్పకూలిపోయినట్లు వివరించారు. ఈ సమయంలో రాంబాబు మేనల్లుడు కూడా ఆయనతో పాటే ఉన్నారని వివరించారు. రాంబాబు కుప్పకూలిన వెంటనే సీపీఆర్‌ చేస్తూ గొల్లపూడి ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు.


అయితే ఆస్పత్రికి వెళ్లేసరికే రాంబాబు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని జగ్గయ్యపేట వైసీపీ ఇంఛార్జి వెల్లడించారు. రాంబాబు చాలా కాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్నారని.. ఆయన మృతిని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పోలీసు అధికారులు ఆస్పత్రికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని.. రాంబాబు మృతిని వైఎస్ జగన్ పర్యటనకు అంట గట్టే ప్రయత్నం చేస్తున్నా్రని ఆరోపించారు.


ఏదోరకంగా జగన్‌ మీద బురదజల్లాలని చూస్తున్నారని విమర్శించారు. డి.రాంబాబు అనారోగ్యానికి గురైన సమయానికి.. వైఎస్ జగన్ ఇంకా వెస్ట్‌బైపాస్‌ ప్రారంభంలోనే ఉన్నారన్న జగ్గయ్యపేట వైసీపీ ఇంఛార్జ్‌.. అప్పటికి ప్రజలు ఇంకా ఇబ్రహీం పట్నం చేరుకోలేదని వివరించారు. అయినప్పటికీ తొక్కిసలాటలో రాంబాబు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa