ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.... ఏపీ ప్రభుత్వం ప్లాన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 08:08 PM

2027లో జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గోదావరి పుష్కరాల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తొలిసారిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26న ప్రారంభం కానున్నాయి. 12 రోజులపాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన మంత్రి.. గోదావరి పుష్కరాలను దేశానికి గర్వకారణంగా నిలిపేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.


భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. టెంట్ సిటీలు, హోమ్‌స్టేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరోవైపు గోదావరి పుష్కరాల ద్వారా స్థానికులకు ఆర్థికంగా లాభాలు చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మండువా లోగిళ్లకు ప్రాధాన్యమిస్తూ స్థానికులకు ఆర్థిక లాభాలు చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.


  మరోవైపు గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు ఒకే ఘాట్ వద్దకు గుమికూడకుండా.. ఒకే ఘాట్ వద్దకు చేరకుండా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా పుష్కరాల సమయంలో గోదావరి పరివాహక ప్రాంతంలో.. ఏ ప్రాంతంలో స్నానం చేసినా కూడా పుణ్య ఫలం సమానమే అనే అవగాహనను ప్రజలు, భక్తుల్లో కల్పించేందుకు ప్రముఖ ప్రవచనకర్తల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు.. గోదావరి పుష్కరాల సందర్భంగా.. రూ.97 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా.. పుష్కర్ ఘాట్ల అభివృద్ధితో పాటుగా, హేవలాక్ వంతెన ఆధునికీకరణ పనులను ప్రభుత్వం చేపడుతోంది. అలాగే బ్రిడ్జిలంకలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు, కడియంలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్, నిడదవోలులోని కోటసత్తెమ్మ ఆలయ అభివృద్ధి, శెట్టిపేటలో బోట్ షికారు పనులను ప్రభుత్వం చేపడుతోంది. అలాగే పుష్కరాల నేపథ్యంలో రహదారుల అనుసంధానాన్ని పెంచడం కోసం కేంద్రం సహకారంతో భారీ ప్రాజెక్టులపై కూడా దృష్టి సారించినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.


గోదావరి పుష్కరాల ఏర్పాట్ల విషయంలో అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేస్తూ శాంతి భద్రతలు, పార్కింగ్, రవాణా, పరిశుభ్రత వంటి అంశాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. గోదావరి పుష్కరాలు 2027 – భక్తి, సంస్కృతి, పర్యాటక సమ్మేళనంగా నిలవాలని.. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa