లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి, పరిష్కారం లభించేంత వరకు స్పీకర్ స్థానంలో కూర్చోకూడదని ఓం బిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది తన నైతిక బాధ్యత అని, స్పీకర్ స్థానంపై సందేహాలు వ్యక్తమైనప్పుడు తక్షణం చర్చ జరగాలనే సందేశం ఇవ్వడానికే ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్షాలు ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ఇటీవల 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(c) కింద ఈ నోటీసును సమర్పించాయి. దీనిపై సుమారు 120 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు.ఈ నేపథ్యంలోనే ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. తన అభిప్రాయాన్ని మంగళవారం వివిధ పార్టీల నేతలకు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలియజేశారు. ప్రభుత్వం గానీ, ప్రతిపక్షాలు గానీ కోరినా తాను తన నిర్ణయాన్ని మార్చుకోబోనని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ బడ్జెట్ సమావేశాల రెండో భాగం తొలి రోజైన మార్చి 9న జరిగే అవకాశం ఉంది. అప్పటివరకు ఓం బిర్లా స్పీకర్ సీటుకు దూరంగా ఉండనున్నారు. పార్లమెంటరీ చరిత్రలో స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాసం ఎప్పుడూ నెగ్గనప్పటికీ, తాజా పరిణామంతో బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa