రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు యువజన విభాగం మరింత చురుకుగా పనిచేయాలని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర ప్రాంత వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం నేతల సమావేశం జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా, నియోజకవర్గ, మండల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించిన ఆయన, నిరుద్యోగ భృతి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల సామాన్య కుటుంబాలకు విద్య అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, పార్టీ బలోపేతానికి యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించి, ప్రజలతో మమేకమవుతూ పనిచేయాలని నాయకులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa