ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లను కేవలం చదువుకే పరిమితం చేయాలని నాగబాబు సూచన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 08:57 PM

16 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులకు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ చిన్నారులు సైబర్ నేరాలు, ప్రమాదకరమైన ఆన్‌లైన్ ట్రెండ్స్ బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.సోషల్ మీడియాలో మంచి, చెడులను విశ్లేషించుకునే విచక్షణ పెద్దలకు ఉంటుందని, కానీ 16 ఏళ్ల లోపు పిల్లలకు ఆ పరిపక్వత ఉండదని నాగబాబు అన్నారు. గతంలో ‘బ్లూ వేల్ చాలెంజ్’ వంటి ప్రమాదకరమైన క్రీడలకు ఆకర్షితులై ఎంతోమంది చిన్నారులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం ‘మెమో చాలెంజ్’స్కల్ బ్రేకర్ చాలెంజ్ఫైర్ చాలెంజ్’ వంటి ప్రాణాంతకమైన సాహసాలు పిల్లలను ఆకర్షిస్తున్నాయని, వాటికి ఆకర్షితులై కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కఠినమైన చట్టాలు రూపొందించాలని నాగబాబు ప్రభుత్వానికి సూచించారు. ఆస్ట్రేలియా ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి పలు ఐరోపా దేశాలు ఇప్పటికే 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఐటీ పోలీస్ విద్యాశాఖలు సమన్వయంతో పనిచేసి సోషల్ మీడియా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.హోం, ఐటీ, విద్యా శాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో కేవలం విద్యకు సంబంధించిన సమాచారం మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ట్యాబ్‌లలో సోషల్ మీడియా యాప్‌లను వాడకుండా పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పాఠశాలల్లో జరిగే పేరెంట్స్-టీచర్స్ సమావేశాల్లో తల్లిదండ్రులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని, తద్వారా చిన్నారుల భవిష్యత్తును కాపాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa