ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంజనేయ స్వామిపై భక్తి.. అరకేజీకిపైగా బంగారం ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 09:22 PM

అసలే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. గోల్డ్ కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఓ భక్తుడు దేవుడికి భారీగా బంగారాన్ని కానుకగా ఇచ్చారు. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని శింగరకొండలో కొలువై ఉన్న ప్రసిద్ధ ప్రసన్నాంజనేయస్వామివారికి ఖరీదైన కానుకను అందజేశారు. స్వామివారికి బంగారు కిరీటం కోసం దాత ఈ బంగారాన్ని ఇచ్చారు. ప్రసన్నాంజనేయస్వామివారిపై ఉన్న భక్తితో ఈ బంగారాన్ని అందజేశారు ఆ భక్తుడు.


బాపట్ల జిల్లా చీరాల కొత్తపేటకు చెందిన ముప్పవరపు సుధీర్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి ప్రత్యూషతో కలిసి స్వామివారికి 600 గ్రాముల బరువున్న ఆరు బంగారు బిస్కట్లను ఆలయ ఈవోకు అందజేశారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళి, సభ్యులు పాల్గొన్నారు. ఈ బంగారు బిస్కట్లను స్వామివారి కిరీం తయారు చేయడానికి.. మంగళగిరికి చెందిన స్వర్ణకారుడు కాటూరి సుబ్బారావుకు ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో ఉంది.. ఆరు బంగారు బిస్కట్ల ధర రూ.రూ.96 లక్షలుందని.. కిరీటం తయారీకి మరో రూ.10 లక్షలు అవుతుందని అంచనా వేశారు.


శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామివారికి కిరీటం తయారు చేసేందుకు మొత్తం ఖర్చు రూ.1.06 కోట్లు అవుతుంది. ఈ మొత్తాన్ని దాత ముప్పవరపు సుధీర్ భరించనున్నారు. శింగరకొండ ఆలయ చరిత్రలో తొలిసారి ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని స్వామివారికి ఇచ్చారు. గతంలో ఎవరూ ఇంత భారీ మొత్తంలో బంగారం ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ సందర్భంగా బంగారాన్ని అందజేసిన దాతలు ఆయలంలో ప్రత్యేక పూజలు చేశారు.. అనంతరం దాతలను పాలకమండలి ఛైర్మన్ ఘనంగా సన్మానించారు.


అద్దంకి సమీపంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.20 కోట్లతో నాలుగు రాజగోపురాలు, ప్రాకారం నిర్మించాలని పాలకమండలి, దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. పలువురు దాతల సహకారంతో పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సిద్ధాంతులు, దేవదాయశాఖ స్థపతి, పలువురు ప్రముఖులను సంప్రదించారు.. వారు కూడా పునర్నిర్మాణం చేపట్టాలని సూచించారు. దాతలు కూడా ఈ ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చారు. జనవరిలో పనులు ప్రారంభించాలని భావించారు.. కానీ ఆ పనులు ఆలస్యం అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa