ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తారిక్ రెహమాన్ కు.. స్పెషల్‌గా స్వీట్లు, పూలు పంపించిన మమతా బెనర్జీ

national |  Suryaa Desk  | Published : Sun, Feb 15, 2026, 08:30 PM

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరిగిన 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ భారీ విజయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. బీఎన్‌పీ అగ్రనేత తారిక్ రెహమాన్‌ను తన సోదరుడిగా సంబోధిస్తూ.. ఆయనకు కోల్‌కతా నుంచి ప్రత్యేకంగా పూల గుచ్ఛాలు, మిఠాయిలను పంపారు.


గుల్షాన్ కార్యాలయంలో 'దీదీ' కానుక


మమతా బెనర్జీ పంపిన ఈ బహుమతులను ఢాకాలోని గుల్షాన్ ప్రాంతంలో ఉన్న బీఎన్‌పీ ఛైర్‌పర్సన్ రాజకీయ కార్యాలయంలో ఆ పార్టీ మీడియా సెల్ సభ్యుడు అతికర్ రెహమాన్ రుమాన్ అందుకున్నారు. ఈ సందర్భంగా మమత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "నా సోదర సోదరీమణులైన బంగ్లాదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తారిక్ భాయ్, ఆయన పార్టీ సాధించిన ఈ గొప్ప విజయానికి నా అభినందనలు. అలాగే బంగ్లా ప్రజలందరికీ అడ్వాన్స్ 'రంజాన్ ముబారక్'. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నాను" అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.


అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ


భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం తారిక్ రెహమాన్‌కు ఫేస్‌బుక్ ద్వారా అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్‌పీని నిర్ణయాత్మక విజయం వైపు నడిపించినందుకు రెహమాన్‌ను ఆయన ప్రశంసించారు. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఉన్న చారిత్రాత్మక సంబంధాల నేపథ్యంలో.. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని సంకేతాలు ఇచ్చారు.


ఎన్నికల ఫలితాల సరళి: బీఎన్‌పీ క్లీన్ స్వీప్


బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం.. 299 స్థానాలకు 212 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. మరోవైపు జమాత్ ఇ ఇస్లామ్ పార్టీ కేవలం 77 స్థానాల్లో విజయం సాధించింది. ఇస్లామీ ఆందోళన్ బంగ్లాదేశ్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు 7 స్థానాల్లో విజయం సాధించారు. బంగ్లాదేశ్‌లో త్వరలో తారిక్ రెహమాన్ సారథ్యంలో నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. మమతా బెనర్జీ పంపిన ఈ మిఠాయి దౌత్యం భవిష్యత్తులో తీస్తా నదీ జలాల పంపిణీ వంటి కీలక అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa