సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల తీరుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలను తిరిగి వెనక్కి పిలిపించే ‘రీకాల్’ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనిమిది దేశాల్లో ఈ పద్ధతి అమలులో ఉందని గుర్తు చేస్తూ, మన దగ్గర కూడా ప్రజాప్రతినిధుల జవాబుదారీతనాన్ని పెంచడానికి ఇటువంటి కఠిన నిబంధనలు అవసరమని ఆయన స్పష్టం చేశారు.
సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే వారి జీతాల్లో కోత విధిస్తున్నప్పుడు, సభకు రాని ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు మినహాయింపు ఉండాలని స్పీకర్ ప్రశ్నించారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా నిరభ్యంతరంగా జీతభత్యాలు అందుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. పని చేయని వారికి వేతనం చెల్లించకూడదనే నియమం అందరికీ వర్తించాలని, అందుకే గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల శాలరీ కట్ చేసే అంశాన్ని ఆలోచించాలన్నారు.
సభలో జరుగుతున్న చర్చల నాణ్యతపై కూడా అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేల ప్రసంగాల కంటే, ఇటీవల నిర్వహించిన ‘మాక్ అసెంబ్లీ’లో విద్యార్థులు చేసిన ప్రసంగాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు అంశాలవారీగా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడారని, కానీ ప్రజాప్రతినిధులు ఆ స్థాయిలో సభలో రాణించలేకపోతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తమ బాధ్యతను గుర్తించి సభా చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన హితవు పలికారు.
ఇక అసెంబ్లీలో పారదర్శకతను పెంచేందుకు ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ విధానం అద్భుతంగా పనిచేస్తోందని స్పీకర్ కొనియాడారు. సాంకేతికతను ఉపయోగించుకోవడం వల్ల హాజరు నమోదులో స్పష్టత వస్తుందని, ఎవరు సభకు వస్తున్నారు, ఎవరు రావడం లేదనే విషయం పక్కాగా తెలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో శాసనసభ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడానికి మరిన్ని సంస్కరణలు చేపడతామని, ప్రజాప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa