ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు, బిల్డర్లకు తీపికబురు చెప్పింది. భవన నిర్మాణ సమయంలో వీఎల్‌టీ (భవన నిర్మాణ సమయంలో వసూలు చేస్తున్న ఖాళీ స్థలం పన్ను) 50%కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రవేశ పెట్టిన సవరణ బిల్లును ఆమోదించారు. ఈ నిర్ణయంతో ప్రజలు, బిల్డర్లకు ఏటా రూ.30 కోట్ల వరకు లబ్ధి చేకూరుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజలకు భారం కాకూడదని.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నష్టమైనా.. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ వీఎల్‌టీని 50శాతానికి తగ్గింపు అనుమతులు తీసుకున్న తేదీ నుంచి వర్తిస్తుంది. వీఎల్‌టీని 50శాతానికి తగ్గించాలని ప్రజలు, బిల్డర్ల నుంచి రిక్వెస్ట్‌లు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీఎల్‌టీని 50శాతం తగ్గించాలని 2014-2019 టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.. 2019 ఫిబ్రవరి 24న 50శాతం పన్నును జీవోను కూడా విడుదల చేసింది. కానీ జీవో అమలుకు ఇబ్బందులు రావడంతో గత ప్రభుత్వం పక్కన పెట్టేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చట్ట సవరణ చేసింది.. త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.
ఏపీ ప్రభుత్వం వీఎల్‌టీని 50శాతానికి తగ్గించడంతో ప్రజలు, బిల్డర్లకు ప్రతి ఏటా రూ.30కోట్లు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే మున్సిపల్‌శాఖకు ప్రతి ఏటా రూ.60 కోట్లు ఆదాయం వస్తుంది అంటున్నారు. భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్న రోజు నుంచి నిర్మాణం పూర్తి చేసేలోపు వీఎల్‌టీ వసూళ్లు ఇలా ఉన్నాయి. స్థలం విలువపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విలువ ఆధారంగా కార్పొరేషన్లలో 0.5శాతం, మున్సిపాలిటీల్లో 0.2శాతం చొప్పున వీఎల్‌టీ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని 50శాతానికి తగ్గించారు. అలాగే భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్న తర్వాత నిర్ణీత గడువులోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐదు అంతస్తులైతే మూడేళ్లలో, ఐదు కంటే ఎక్కువ అంతస్తులైతే ఆరేళ్లలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ భవనాలకు మాత్రమే వీఎల్‌టీ తగ్గింపు వర్తిస్తుంది. వీఎల్‌టీ తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు స్వాగతించారు. ప్రజలకు, బిల్డర్లకు ఎంతో లబ్ధి జరుగుతుందంటున్నారు.
ప్రస్తుతం వీఎల్‌టీ (భవన నిర్మాణ సమయంలో వసూలు చేస్తున్న ఖాళీ స్థలం పన్ను) 100శాతం వసూలు చేస్తున్నారు.. ఇకపై 50శాతం మాత్రమే వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు జరుగుతుంది. అయితే నిర్మాణం పేరు చెప్పి కొందరు సుదీర్ఘకాలం రాయితీ పొందాలనుకునే ప్రమాద ఉంటుంది.. అలాంటి వారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందంటున్నారు. నిర్మాణాలకు కాలపరిమితి ఉండాలంటున్నారు. ఒకవేళ ఎవరైనా నిర్మాణం మధ్యలో నిలిపివేస్తే రాయితీ రికవరీ చేయాల్సిన అవసరం ఉందుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అనుమతులు లేని లేఅవుట్లపై చర్యలు చేపట్టాలి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa