ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాత్రూమ్‌ నుంచి వచ్చే కంపును దూరం చేసే చిట్కాలు

Life style |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 11:35 PM

ఇంటిని క్లీన్‌గా ఉంచుకోవడం మన బాధ్యత. ఇల్లు, కిచెన్‌ను చాలా మంది ప్రతి రోజూ క్లీన్ చేసుకుంటారు. అలాగే టాయిలెట్‌ను కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటారు. బాత్రూమ్‌ను ఎంతగా క్లీన్ చేసినప్పటికీ వాసన అలాగే ఉంటుంది. ఇది దాదాపు చాలా మంది ఎదుర్కొనే సమస్య. ప్రతి ఉదయం, సాయంత్రం క్లీన్ చేసినప్పటికీ వాసన అలాగే ఉంటుంది. ఖరీదైన రూమ్ ఫ్రెషన్లరు, క్లీనర్ల వాసన కొందరికి పడదు. వాటి వాసనకి వికారం వచ్చినట్టుగా ఉంటుంది.


​బాత్రూమ్ నుంచి వాసన రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గాలిలో తేమ, మూత్రం, టాయిలెట్, డిటర్జెంట్, బాత్రూమ్ మురికి, టాయిలెట్ మురికి, దుర్వాసన కారణంగా వింత వాసన ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఈ కంపు వల్ల మనం బాత్రూమ్‌లో 5 నిమిషాలు కూడా ఉండలేం. బయటి నుంచి అతిథులు ఇంటికి వస్తే మనం ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, కొన్ని ఇంటి చిట్కాలు బాత్రూమ్ నుంచి వచ్చే వాసనను దూరం చేస్తాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చుద్దాం.


అసలు బాత్రూమ్ దుర్వాసనకు కారణం ఏంటి?


​టాయిలెట్ దుర్వాసన కేవలం ధూళి వల్ల మాత్రమే కాదు. కొన్నిసార్లు, డ్రైనేజీ పైపుల నుంచి వచ్చే గ్యాస్, తేమ, ఫంగస్, బ్యాక్టీరియాతో కలిసి ఒక ప్రత్యేకమైన, వింతైన వాసనను సృష్టిస్తాయి. అంతేకాకుండా పేలవమైన వెంటిలేషన్ లేదా బాత్రూమ్‌లో నీరు నిలిచి ఉండటం వల్ల దుర్వాసన మరింత తీవ్రమవుతుంది. అందుకే శుభ్రమైన టాయిలెట్ నుంచి కూడా దుర్వాసన వస్తుంది. అయితే, కొన్ని సహజ చిట్కాల్ని పాటించడం వల్ల ఈ వాసనల్ని దూరం చేయొచ్చు.


బేకింగ్ సోడా, వెనిగర్ చిట్కా


బాత్రూమ్ దుర్వాసనల్ని తొలగించడానికి బైకార్బోనేట్ ఆఫ్ సోడా (బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమం ఒక గొప్ప నివారణ. ఇందుకోసం ముందుగా ఒక పాత్ర లేదా గిన్నెలో ఒక కప్పు బేకింగ్ సోడా, ఒక కప్పు వైట్ వెనిగర్ కలపండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దానిని బాత్రూమ్ పైపుల్లో పోయాలి.


దానిని కొద్దిసేపు అలాగే ఉంచి.. ఆపై గోరువెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇది దుర్వాసనను తొలగించడమే కాకుండా బ్యాక్టీరియా, మురికిని కూడా శుభ్రపరుస్తుంది. మీరు కావాలనుకుంటే ఒక కప్పు బేకింగ్ సోడా, రెండు నిమ్మకాయ ముక్కల్ని తీసుకుని బాత్రూమ్ కిటీకి వద్ద ఉంచొచ్చు. అయితే, కొన్ని రోజులకు వీటిని మారుస్తూ ఉండాలి.


నిమ్మకాయ, ఉప్పు ట్రిక్


బాత్రూమ్ దుర్వాసనను తొలగించడంలో నిమ్మకాయ, ఉప్పు మిశ్రమం కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం నిమ్మరసంలో ఉప్పు కలిపి బాత్రూమ్ నేలపై, వాష్ బేసిన్‌పై రుద్దండి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.


ఇది దుర్వాసనను తొలగించే సహజ నివారిణిగా పనిచేస్తుంది. ఇది దుర్వాసనను తొలగించడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. బాత్రూంలో బొగ్గు సంచులు లేదా బొగ్గు ముక్కలను ఉంచండి. ఇవి గాలి నుంచి తేమ, వాసనల్ని గ్రహిస్తాయి. అంతేకాకుండా చెడు వాసనలను తొలగిస్తాయి.


కర్పూరంతో వాసనను తొలగించవచ్చు


కర్పూరం బలమైన వాసన, సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నెమ్మదిగా గాలిలో కరిగి, దుర్వాసన కలిగించే సూక్ష్మజీవులను తగ్గిస్తుంది. ఇంకా, దాని సువాసన తేమ యొక్క వాసను తొలగించడంలో సాయపడుతుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు బాత్రూమ్ కమోడ్‌లో కర్పూరం బిళ్లలను ఉంచడం. దాని సువాసన రాత్రిపూట నీటిలో కరిగి కమోడ్, పైపుల అంతటా వ్యాపిస్తుంది. ఉదయం ఫ్లష్ చేయడం వల్ల దుర్వాసన తొలగిపోతుంది.


బేకింగ్ సోడా, కర్పూరం మిశ్రమం


బాత్రూమ్ నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంటే అర కప్పు బేకింగ్ సోడాను పొడి కర్పూరంతో కలిపి కమోడ్ అంచులు, నేలపై చల్లుకోండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. బేకింగ్ సోడా మురికి, మరకల్ని వదిలిస్తుంది. కర్పూరం సువాసన, సూక్ష్మక్రిముల నియంత్రణకు సాయపడుతుంది.


ఈ పద్ధతి సులభం. లోతుగా పనిచేస్తుంది. అయితే, కర్పూరం సహజమైనదే అయినప్పటికీ క్లోజ్ చేసిన ప్రదేశంలో ఎక్కువగా అంటే పెద్ద మోతాదులో వాడటం వల్ల ఘాటైన వాసన వస్తుంది. అందుకే కర్పూరాన్ని తక్కువ మోతాదులో వాడండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa