ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి..టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న జింబాబ్వే

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 10:34 PM

టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ దశలో జింబాబ్వే అజేయంగా నిలిచింది. వారం క్రితం ఆస్ట్రేలియాపై గెలిచి సంచలనం సృష్టించిన జింబాబ్వే.. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను సైతం చిత్తు చేసింది. దీంతో గ్రూప్-బిలో అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. జింబాబ్వే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.


స్లో పిచ్ మీద ఓవర్‌కు దాదాపు 9 పరుగుల చొప్పున సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగిన జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్‌), మరుమని (26 బంతుల్లో 34) తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలో 69 పరుగులు జోడించారు. మరుమని ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ర్యాల్ బర్న్ 12 బంతుల్లోనే 23 రన్స్ చేయగా.. కెప్టెన్ సికిందర్ రజా 26 బంతుల్లో 45 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్రికన్ జట్టు సునాయాసంగా గెలుపొందింది.


ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రజా.. ఆరంభంలో రిథమ్ అందిపుచ్చుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. 14 ఓవర్లు ముగిశాక.. జింబాబ్వే విజయానికి 65 రన్స్ అవసరమైన దశలో రజా చెలరేగాడు. శ్రీలంక ప్రధాన స్పిన్నర్లు దసున్ హేమంత, మహీష్ థీక్షణ బౌలింగ్‌లో షాట్లతో విరుచుకుపడిన సికందర్ రజా.. ఆ రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టాడు. దీంతో ప్రత్యర్థిపై జింబాబ్వే పైచేయి సాధించింది.


ఓవైపు రజా విరుచుకుపడుతుంటే.. మరో ఎండ్‌లో బెన్నెట్ కూల్‌గా ఆడాడు. 8 బౌండరీలు కొట్టిన బెన్నెట్.. మధ్య ఓవర్లలో జింబాబ్వేను ముందుకు నడిపించాడు. చివర్లో రజా, ముసెకివా వెనువెంటనే ఔటైనప్పటికీ.. బెన్నెట్ ప్రశాంతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 21 ఏళ్ల బెన్నెట్ ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ ఔట్ కాకపోవడం విశేషం. ఒమన్‌పై 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన బ్రియాన్.. బౌలింగ్‌లో 18 పరుగులిచ్చాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 64 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన ఈ ఓపెనర్.. శ్రీలంకపైనా హాఫ్ సెంచరీతో అజేయంగా నిలవడం గమనార్హం.


గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒమన్, ఆస్ట్రేలియా జట్లపై జింబాబ్వే విజయం సాధించింది. శ్రీలంకతో మ్యాచ్ కంటే ముందు ఐర్లాండ్‌‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో జింబాబ్వే సూపర్-8కు అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.


జింబాబ్వే విజయాల్లో ఆ నలుగురు..


జన్మతః పాకిస్థానీ అయిన సికందర్ రజా.. బ్యాటింగ్‌తోపాటు తన కెప్టెన్సీతో జింబాబ్వేను ఈ టీ20 వరల్డ్ కప్‌లో అజేయంగా ముందుకు నడిపిస్తుండగా.. యువ ఓపెనర్ బెన్నెట్ తన అజేయ బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. మరోవైపు బౌలర్లు బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఇవాన్స్ సైతం వికెట్ల వేటలో సత్తా చాటుతున్నారు.


ఒమన్‌పై 16 పరుగులిచ్చి వికెట్లు తీసిన ముజరబానీ.. ఆస్ట్రేలియాపై 17 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 38 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 3 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో వరుణ్ చక్రవర్తితో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇవాన్స్ సైతం 3 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఒమన్, ఆస్ట్రేలియా జట్లపై మూడేసి వికెట్ల చొప్పున తీసిన ఇవాన్స్.. శ్రీలంకపై 2 వికెట్లు పడగొట్టాడు. ఈ నలుగురు అద్భుతమైన ఆటతో జింబాబ్వే ఇక ఏమాత్రం అండర్ డాగ్స్ కాదని నిరూపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa