ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొన్న 11 వేల మందికి లేఆఫ్స్.... ఏఐతో ప్రమోషన్లకు లింక్

business |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 10:39 PM

ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ వినియోగం కొంత కాలంగా విపరీతంగా పెరిగింది. పలు కంపెనీలు తమ కార్యకలాపాల్లో ఏఐని భాగం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఏఐపై విస్తృతంగా పెట్టుబడులు పెడుతూ ఇదే సమయంలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు.. ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకుంటున్నాయి. మరోవైపు ఉద్యోగులను చాలా వరకు ఏఐతో రీప్లేస్ చేసే కంపెనీలు ఉన్నాయి. ఐటీలో కొత్త కొత్త ఏఐ టూల్స్ తీవ్ర భయాందోళనల్ని సృష్టిస్తున్నాయి. ఇటీవల ఆంథ్రోపిక్ ఏఐ ఇలానే కొత్త టూల్ క్లాడ్ కోవర్క్ తీసుకురాగా.. ఐటీ స్టాక్స్ భారీగా కుదేలయ్యాయి. ఇప్పుడు ఇదే ఏఐ వినియోగంపై ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అసెంచర్ కీలక ప్రకటన చేసింది. ఏఐ వాడకాన్ని బట్టే ప్రమోషన్లు ఉంటాయని పేర్కొంది.


>> ఇక్కడ ఏఐపై విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్న క్రమంలో.. ఏఐతో తమ పని సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని.. ఆదాయం పెంచుకోవాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసెంచర్ కూడా అదే భావించింది. తమ సిబ్బంది కూడా ఏఐ వినియోగాన్ని అందిపుచ్చుకొని.. మెరుగైన పనితీరు కనబర్చాలని ఐటీ దిగ్గజ సంస్థ కోరుకుంటోంది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులు ఏఐ టూల్స్ తప్పనిసరిగా వినియోగించాలని గట్టి వార్నింగ్ ఇచ్చింది.


 ఏఐ వినియోగాన్ని బట్టి తమ స్థాయిని బట్టి లీడర్ షిప్ రోల్స్ అందుకుంటారని.. ఇంకా ప్రమోషన్లు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొంది. ఏఐ వాడకం సరిగా లేకపోతే ప్రమోషన్లు కూడా ఉండవని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీనియర్ మేనేజర్స్, అసోసియేట్ డైరెక్టర్లకు కంపెనీ మెయిల్ చేసినట్లు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.


అసెంచర్ మొత్తం ఉద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకుపైగా ఉంటే.. ఇందులో సగానికిపైగా భారత్ ప్రధాన కేంద్రంగానే పనిచేస్తున్నారు. కొంత కాలంగా ఇది కృత్రిమ మేధపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇక్కడ ఏఐతో రీస్కిల్ చేయడం సాధ్యం కాని ఉద్యోగాల్ని తొలగించింది. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబరులో 11 వేల మందికి లేఆఫ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజా హెచ్చరిక చేసింది.


ఇదొక్కటే కాదు మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా కొంత కాలంగా ఏఐ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. సరికొత్త ఏఐ ఆవిష్కరణల కోసం ఇటీవల ఇన్ఫోసిస్ సంస్థ ఆంథ్రోపిక్ ఏఐ సంస్థతో.. టీసీఎస్ మరోవైపు ఓపెన్ ఏఐ సంస్థతో డీల్స్ కుదుర్చుకున్నాయి. ఇదే సమయంలో కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్ధంగా లేని వారు.. స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందొచ్చని గూగుల్.. తన ఉద్యోగులకు సూచించింది. వారికి వాలెంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని కూడా ఆఫర్ చేసింది. ఇతర టెక్ కంపెనీలు.. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటివి కూడా ఇలాంటి ప్యాకేజీల్ని ప్రవేశపెట్టాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa