తల్లి కావడం ప్రతి మహిళకు ప్రత్యేకమైన అనుభూతి. అయితే, ఈ ఆనందం కోసం వారు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటారు. ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఎక్కువగా జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటారు. ఇది పూర్తిగా సాధారణం. ప్రసవం తర్వాత హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల జుట్టు రాలుతుంది. జుట్టు రాలడానికి కారణాలు, దీన్ని ఎలా మేనేజ్ చేయాలో ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రష్మీ శ్రీరామ్ నుంచి తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటి ప్రభావాలు ప్రసవం తర్వాత కూడా కనిపిస్తాయి. అలాంటి సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. ప్రసవం తర్వాత జుట్టు రాలడం అనేది చాలా మంది కొత్త తల్లుల్లో కనిపించే ఒక సాధారణ సమస్య. దీనిని 'పోస్ట్‌పార్టమ్ హెయిర్ లాస్' అంటారు. దీనికి గల కారణాలు, నివారణ చర్యలు గురించి డాక్టర్ రష్మీ శ్రీరామ్, డెర్మటాలజిస్ట్ (ఫోర్టిస్ హాస్పిటల్, రాజాజీ నగర్, బెంగళూరు) వివరించారు.
అసలు జుట్టు ఎందుకు రాలుతుంది?
గర్భధారణ సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని డాక్టర్ అంటారు. దీనివల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా కనిపిస్తుంది. కానీ ప్రసవం తర్వాత ఈ హార్మోన్ స్థాయిలు ఒక్కసారిగా అసమతుల్యతకు గురవుతాయి అంటే పడిపోతాయి. దీనివల్ల పెరుగుదల దశలో ఉన్న జుట్టు అంతా ఒక్కసారిగా రాలే దశకు చేరుకుంటుంది. సాధారణంగా ప్రసవం జరిగిన 2 నుంచి 3 నెలల తర్వాత ఈ సమస్య మొదలవుతుంది.
ప్రసవం తర్వాత జుట్టు రాలడం అనేది చాలా మంది కొత్త తల్లుల్లో కనిపించే ఒక సాధారణ సమస్య. దీనిని పోస్ట్‌పార్టమ్ హెయిర్ లాస్ అంటారు. డెలివరీ తర్వాత జుట్టు రాలడానికి అతిపెద్ద కారణం హార్మోన్ల మార్పులు. ప్రెగ్నెన్సీ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టును మందంగా, బలంగా ఉంచుతుంది. అదే డెలివరీ తర్వాత ఈస్ట్రోజెన్ స్థాయిలు వేగంగా పడిపోతాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత జుట్టు మూలాల్ని బలహీనరుస్తుంది. జుట్టు రాలడానికి కారణమవుతుంది.
డాక్టర్ రష్మీ శ్రీరామ్
జుట్టు రాలడానికి ఇతర కారణాలు
పోషకాహార లోపం: ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతారు. దీంతో బరువు తగ్గాలనే తొందరంలో డైట్ ఫాలో అవుతారు. దీంతో ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు సరిగ్గా అందవు. దీంతో, జుట్టు రాలుతుంది.
ఒత్తిడి, నిద్రలేమి: కొత్తగా తల్లి అయినప్పుడు పెరిగే బాధ్యతలు, ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతుంది. నవజాత శిశువును జాగ్రత్తగా చూసుకోవడం, రాత్రంతా మేల్కొని ఉండటం, శారీరక అలసట తల్లిని మానసికంగా క్షీణింపజేస్తాయి. దీంతో, జుట్టు రాలడం కనిపిస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించుకునే నివారణ చర్యలు
మానసిక ఆరోగ్యం: ప్రసవం తర్వాత ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
సరైన ఆహారం: తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది.
సహజ చిట్కాలు: ఉసిరి నూనె జుట్టు కుదుళ్లకు తగిన పోషణనిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్సెస్‌లో పబ్లిష్ అయిన జర్నల్‌లో మెంతుల్ని నానబెట్టి మెత్తగా చేసి జుట్టుకు పట్టించడం వల్ల కుదుళ్లు దృఢంగా మారుతాయి.
జుట్టు పెరుగుదలకు పోషకాహారం
జుట్టు లోపలి నుంచి దృఢంగా మారాలంటే కింది ఆహారాల్ని రోజువారీ డైట్‍లో చేర్చుకోవాలి.
ప్రోటీన్: జుట్టు ప్రధానం కెరాటిన్ అనే ప్రోటీన్‌తో నిర్మితమవుతుంది. అందుకే గుడ్లు, పప్పు ధాన్యాలు, సోయా, పనీర్ ఎక్కువగా తీసుకోండి.
ఐరన్: రక్తహీనత సమస్య వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. పాలకూర, బెల్లం, ఖర్జూరం, శనగలు, పెసలు, రాజ్మా వంటివి తీసుకోవడం వల్ల ఐరన్ పెరుగుతుంది. దీంతో, జుట్టు పెరుగుదల మెరగవుతుంది.
బయోటిన్, ఒమేగా - 3: బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు జుట్టుకు మంచి మెరుపును, బలాన్ని ఇస్తాయి.
విటమిన్ సి: సిరికాయ, నిమ్మరసం, జామకాయ వంటి విటమిన్ సి ఫుడ్స్ తినాలి. దీంతో, ఐరన్ శరీరానికి బాగా అందుతుంది.
కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు
తడి జుట్టును దువ్వకండి: జుట్టు తడిగా ఉన్నప్పుడు కుదుళ్లు సాధారణంగా బలహీనంగా ఉంటాయి. అప్పుడు దువ్వితే జట్టు ఎక్కువగా రాలుతుంది.
హీటింగ్ వద్దు: హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిటెనర్లు, కర్లర్స్ వంటి వేడిని ఉత్పత్తి చేసే పరికరాలను వాడటం తగ్గించండి.
నీళ్లు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగండి. ఎందుకంటే జుట్టుకు తగినంత హైడ్రేషన్ ముఖ్యం.
జుట్టు సంరక్షణ: జుట్టును చాలా గట్టిగా ముడి వేయకూడదు. ఇది జుట్టు కుదుళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. జుట్టు దువ్వేటప్పుడు బలంగా లాగకుండా సున్నితంగా చూసుకోండి. కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ వాడకపోవడమే మంచిది.
చివరగా ఏం తెలుసుకోవాలి?
సాధారణంగా ఏడాది లోపు జుట్టు పెరుగుదల మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుంది. నిద్రలేమి, ఒత్తిడి జుట్టు రాలడాన్ని పెంచుతాయి. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , జుట్టు మూలాల్ని పోషించడానికి వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెతో మీ తలకు మసాజ్ చేయండి. ఒకవేళ ప్రసవం 12 నెలల తర్వాత కూడా జుట్టు విపరీతంగా రాలుతున్నా లేదా తలపై ప్యాచెస్‌లాగా జుట్టు ఊడిపోతున్నా వెంటనే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa