ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుంకాల ఆలోచన మంచిదే అయితే అలా చేయండి.. ట్రంప్‌కి భారత సంతతి లాయర్ సవాల్

international |  Suryaa Desk  | Published : Sun, Feb 22, 2026, 04:58 PM

అమెరికా సుప్రీంకోర్టు సుంకాలను రద్దుచేసినా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సుప్రీం తీర్పు తర్వాత ప్రపంచ దేశాలపై సుంకాలను 10 శాతం విధించిన ట్రంప్.. మళ్లీ వాటిని 15 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. కాగా, సుంకాలకు వ్యతిరేకంగా కోర్టులో వాదనలు వినిపించిన భారత సంతతికి చెందిన లాయర్ నీల్ కాత్యాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టారీఫ్‌ల విషయంలో కాంగ్రెస్ (పార్లమెంట్) అనుమతి లేకుండా కార్యనిర్వాహక ఉత్తర్వులు వెలువరించే అధికారం ట్రంప్‌నకు లేదని అన్నారు. ఒకవేళ, సుంకాల పెంపు మంచి ఆలోచనే అయితే.. రాజ్యాంగాన్ని అనుసరించాలని ఆయన కోరారు.


వాణిజ్య చట్టం 1974 సెక్షన్ 122 ప్రకారం ప్రస్తుతం ప్రకటించిన 15 శాతం సుంకాల చట్టబద్దతను కత్యాల్ ప్రశ్నించారు. సెక్షన్ 122 వాణిజ్య లోటులకు సంబంధించిన పరిస్థితులకు సరిపోదని, ఇవి చెల్లింపులకు భిన్నంగా ఉంటాయని న్యాయ శాఖ (DOJ) గతంలో కోర్టుకు చెప్పిందని ఆయన ఎత్తి చూపారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో భారత సంతతి లాయర్ పోస్ట్ పెట్టారు.


‘‘మన కేసులో న్యాయ శాఖకు విరుద్ధంగా అధ్యక్షుడు 15 శాతం సుంకాల విషయంలో సెక్షన్ 122పై ఆధారపడలేరు.. అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు అధ్యక్షుడు వాణిజ్య లోటు అంశాలను కారణాలుగా చూపారు.. కానీ, ఇవి పూర్తి భిన్నంగా ఉన్నాయి’’ అని అన్నారు. ఒకవేళ ఆయన సుంకాలను విధించాలని అనుకుంటే కాంగ్రెస్ ద్వారా నిర్ణయం తీసుకోవాలి.. టారిఫ్‌లు ఆలోచన మంచిదే అని ట్రంప్ భావిస్తే పార్లమెంట్‌‌ అనుమతి తీసుకుంటే ఇబ్బంది ఉండదు.. మన రాజ్యాంగం కోరుకుంటున్నది అదే’’ అని అన్నారు.


సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ సుంకాలను పెంచుతున్నట్టు చేసిన ప్రకటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సెక్షన్ 122 కింద తొలుత 10 శాతం సుంకాలను ప్రకటించిన ఆయన.. 150 రోజుల పాటు తాత్కాలికంగా అమల్లో ఉంటాయని చెప్పారు. తర్వాత వీటిని చట్టబద్దమైనవిగా పేర్కొంటూ 15 శాతానికి పెంచారు.


కాగా, నీల్ కాత్యాల్ వాదనను ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సమర్థించారు వాణిజ్య లోటు, చెల్లింపుల లోటు ఒకటి కాదని పేర్కొన్నారు.


ఇక, ట్రంప్ తాను ప్రకటించిన 15 శాతం సుంకాలు భారత్‌కు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు.అమెరికా, భారత్‌ల మధ్య మధ్యంతర ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం.. భారత్‌పై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నామని, తమ వస్తువులపై బారత్ సున్నా శాతం అమలు చేయనుందని అమెరికా ప్రకటించింది. దీనిపై తర్వలోనే సంతకాలు చేయాల్సి ఉండగా.. అమెరికా సుప్రీంకోర్టు టారీఫ్‌లను రద్దు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa