తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ద్రవిడ గడ్డపై రాజకీయ సెగలు తారాస్థాయికి చేరుతున్నాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
సంచలన వ్యాఖ్యల వెనుక..
కోయంబత్తూరులో ఆదివారం జరిగిన డీఎంకే యువజన విభాగం సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ.. రాబోయే ఎన్నికలను 'తమిళనాడు వర్సెస్ ఢిల్లీ' మధ్య పోరాటంగా అభివర్ణించారు. "ప్రధాని మోదీ టీవీలో కనిపిస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. నోట్ల రద్దు, కరోనా లాక్డౌన్ వంటి ప్రకటనలతో ఆయన ప్రజలను భయపెట్టారు. కానీ మా ముఖ్యమంత్రి స్టాలిన్ టీవీలోకి వస్తే కొత్త పథకాలతో ప్రజలు సంతోషిస్తారు. మేము ప్రధాని మోదీకి భయపడము. చివరికి ప్రధాని తండ్రి దిగి వచ్చినా సరే మేం అస్సలు భయపడబోము" అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని ఉద్దేశించి.. పది సార్లు ఓడిపోయిన ఆయన్ను ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీ తీవ్ర ఆగ్రహం..
ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ స్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే పార్టీకి సంస్కారం, నీతి లేదని ఆ పార్టీ ప్రతినిధి షెజాద్ పూనావాలా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ వెనుకబడిన తరగతి నుంచి వచ్చారు కాబట్టే డీఎంకే, ఇండియా కూటమి నేతలు ఆయన తల్లిదండ్రులను పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మోదీ తల్లిపై 150కి పైగా అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. గతంలో హిందువుల ఊచకోతకు ఉదయనిధి పిలుపునిచ్చారని.. సనాతన ధర్మాన్ని కించపరిచారని మండిపడ్డారు.
ఓటమి భయంతోనే ఫ్రస్ట్రేషన్?
తెలంగాణ బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు కూడా ఈ వివాదంపై స్పందించారు. తమిళనాడులో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. ఓడిపోతామన్న భయంతోనే డీఎంకే నేతలు ప్రధానిపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో డీఎంకే తన ప్రభావాన్ని కోల్పోతోందని, ఈసారి బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఢిల్లీ వర్సెస్ తమిళనాడు సెంటిమెంట్‌ను రగిలిస్తున్న ఉదయనిధి స్టాలిన్ వ్యూహం ఫలిస్తుందా? లేక ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకే చుట్టుకుంటాయా? అనేది వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa