రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మృత్యువుతో పోరాడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చే పౌరుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి చేర్చి, వారి ప్రాణాలు కాపాడే మంచి మనసున్న వ్యక్తులకు ప్రభుత్వం ఏకంగా రూ. 25,000 నగదు బహుమతిని అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘రాహ్-వీర్’ పథకాన్ని దేశ రాజధానిలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమవారం అధికారికంగా వెల్లడించారు.
ఏమిటి ఈ ‘గోల్డెన్ అవర్’.. ఎందుకీ పథకం?
సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటను వైద్య పరిభాషలో ‘గోల్డెన్ అవర్’ అని పిలుస్తారు. ఈ సమయంలో బాధితులకు తక్షణ చికిత్స అందితే ప్రాణాలు నిలిచే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. అయితే నేటి సమాజంలో చాలామంది రోడ్డు ప్రమాదంలో గాయపడిని వారికి సాయం చేస్తే.. పోలీసు కేసులు, కోర్టు విచారణలు లేదా ఇతర చట్టపరమైన చిక్కులకు భయపడి ముందుకు రావడం లేదు. రోడ్డుపై రక్తమోడుతూ ఇబ్బంది పడుతున్నా, నిస్సహాయంగా పడి ఉన్నా సాయం చేయడానికి వెనుకాడుతున్నారు. అయితే ఈ భయాలను పారద్రోలి, ప్రజల్లో సేవా దృక్పథాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. "ప్రజలు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మానవత్వంతో ముందుకు వచ్చి ప్రాణాలు కాపాడే వారిని ప్రభుత్వం గౌరవిస్తుంది" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
నగదు బహుమతి పొందేందుకు అర్హతలు ఇవే..
ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లోపు తీవ్రంగా గాయపడిన బాధితులను ఆసుపత్రికి లేదా ట్రామా సెంటర్కు తరలించాలి. ఇలా చేసిన వారికి రూ. 25,000 నగదుతో పాటు ప్రభుత్వం ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తుంది. ఒకే ప్రమాదంలో ఎంత మందిని కాపాడినా.. ఆ ఘటనకు సంబంధించి గరిష్టంగా రూ. 25,000 అందజేస్తారు. అలాగే ఏడాది పొడవునా ఉత్తమ సేవలు అందించిన వారిలో 10 మందిని ఎంపిక చేసి జాతీయ స్థాయిలో రూ. 1 లక్ష నగదు పురస్కారం అందిస్తారు.
సహాయం చేసిన వారికి నగదు అందజేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా మెజిస్ట్రేట్, సీనియర్ పోలీసు అధికారులు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్లతో కూడిన ఈ కమిటీ ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత.. రివార్డ్ మొత్తాన్ని నేరుగా సదరు వ్యక్తి బ్యాంక్ ఖాతాకే ఆన్లైన్ ద్వారా జమ చేస్తారు. మోటారు వాహనాల చట్టం 2019 ప్రకారం.. బాధితులకు సాయం చేసే పౌరులను పోలీసులు వేధించకూడదు. ఎలాంటి చట్టపరమైన ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా సాయం చేసే వారికి పూర్తి రక్షణ ఉంటుంది. ఢిల్లీ వంటి రద్దీ నగరాల్లో ఈ పథకం అమలు వల్ల వేలాది మంది ప్రాణాలు కాపాడవచ్చని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa