అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణం ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వ పునాదులను కదిలిస్తోంది. బ్రిటన్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు, అమెరికాలో ఆ దేశ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్ (72)ను లండన్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు తొమ్మిది గంటల విచారించగా.. గంటల్లోనే ఆయనకు బెయిల్ రావడంతో విడుదల చేశారు.
అసలేమిటీ వివాదం?
ఇటీవల విడుదలైన ఎప్స్టీన్ ఫైల్స్లోని కీలక పత్రాలు మాండెల్సన్ను ఇరకాటంలో పడేశాయి. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో.. మాండెల్సన్ ప్రభుత్వ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అత్యంత సున్నితమైన, రహస్య పత్రాలను జెఫ్రీ ఎప్స్టీన్కు పంపినట్లువిచారణలో తేలింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు ఆయన నివాసాలపై దాడులు నిర్వహించి.. కీలక ఆధారాలు సేకరించారు.
మాండెల్సన్ అరెస్ట్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కు పెద్ద తలనొప్పిగా మారింది. మాండెల్సన్కు ఎప్స్టీన్తో ఉన్న అనుబంధం గురించి తెలిసినప్పటికీ.. ఆయన్ను వాషింగ్టన్ రాయబారిగా నియమించారన్న ఆరోపణలు స్టార్మర్పై వస్తున్నాయి. ఈ వివాదం కారణంగా స్టార్మర్కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పటికే రాజీనామా చేశారు. ఈక్రమంలోనే ఎప్స్టీన్ బాధితులకు ప్రధాని స్టార్మర్ క్షమాపణలు చెప్పారు. మాండెల్సన్ తన నేపథ్యం గురించి అబద్ధాలు చెప్పి పదవి పొందారని ఆరోపించారు. మాండెల్సన్ స్థాపించిన 'గ్లోబల్ కౌన్సిల్' సంస్థ కూడా దివాలా తీసే స్థితికి చేరుకుంది. టెస్కో, బార్క్లేస్ వంటి దిగ్గజ సంస్థలు ఈయనతో సంబంధాలను తెంచుకున్నాయి.
"నేను మోసపోయాను": మాండెల్సన్ వివరణ
మాండెల్సన్ తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. జెఫ్రీ ఎప్స్టీన్ ఒక నేరగాడన్న విషయం 2019లో ఆయన చనిపోయే వరకు మాండెల్సన్కు తెలియదని పేర్కొన్నారు. ఎప్స్టీన్ చెప్పిన అబద్ధాలను నమ్మి ఆయనతో స్నేహం చేసినందుకు మాండెల్సన్ జీవితాంతం పశ్చాత్తాప పడతారని తెలిపారు. బాధితులకు జరిగిన అన్యాయం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారన్నారు. వచ్చే మార్చిలో ప్రభుత్వం మాండెల్సన్కు సంబంధించిన వేల కొద్దీ ఇమెయిల్స్, డాక్యుమెంట్లను బహిర్గతం చేయనుంది. చూడాలి మరి ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, నిజంగానే మాండెల్సన్ తప్పు ఉందా లేదా అనేది తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa