ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, జ్యోతిర్‌మఠం పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి మధ్య మాఘమేళా సందర్భంగా మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోక్సో కేసు నమోదయ్యింది. ఈ కేసులో శంకరాచార్యకు తాత్కాలిక ఊరట లభించింది. పీఠాధిపతిని అరెస్టు చేయకుండా అలహాబాద్ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఇవి అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కానీ, స్వామీజీ ముందస్తు బెయిల్ విషయంలో తీర్పును రిజర్వ్ చేసింది.
గురుసేవ పేరుతో ఆశ్రమం, మాఘమేళాలోనూ అవిముక్తేశ్వరానంద చిన్నారులపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ప్రధాన ఆరోపణ. తులసి పీఠాదీశ్వర్ రామభద్రాచార్య స్వామి శిష్యుడు అశుతోష్ బ్రహ్మచారి జిల్లా కోర్టులో సెక్షన్ 173(4) కింద ఫిర్యాదు చేశారు. దీనిపై పోక్సో ప్రత్యేక న్యాయస్థానం అడిషినల్ జడ్జ్ వినోద్ కుమార్ చౌరాసియా విచారణ చేపట్టి.. కేసు నమోదు చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో శంకరాచార్య, ఆయన శిష్యుడు ముకుందానంద్ గిరి, గుర్తుతెలియని మరో ఇద్దరిపై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ప్రయాగరాజ్‌లోని ఝాన్సీ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదుచేశారు.
ఈ నేపథ్యంలో అవిముక్తేశ్వరానంద అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిలు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం విచారణ చేపట్టి స్టే విధించింది. ఇక, ఆశ్రమం వద్దకు మీడియా సిబ్బంది పెద్దఎత్తున చేరుకోగా..యథాప్రకారం రోజువారీ కార్యక్రమాలను అవిముక్తేశ్వరానంద నిర్వహిస్తారని ఆయన శిష్యుడు సంజయ్ సాండే పేర్కొన్నారు.
పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసులో నిజం బయటపడటానికి తాను నార్కో అనాలసిస్ పరీక్షకు కూడా సిద్ధమేనని శంకరాచార్య శుక్రవారం ప్రకటించారు. కోర్టుకు అన్ని సాక్ష్యాలను తమ లాయర్లు సమర్పిస్తారని ఆయన తెలిపారు. తనపై పెట్టిన తప్పుడు కేసులు కోర్టు విచారణలో నిలబడవని అన్నారు. నిజం ఏంటో ప్రజలు తెలుసుకుంటారని, సత్యం బయట పడుతుందని స్వామీజీ చెప్పారు. కేవలం తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు, అంతర్జాతీయంగా దుమారం రేపుతోన్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్' నుంచి దృష్టి మళ్లించేందుకు తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa