ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్ కార్డుదారులకు ఈసారికి కూడా కందిపప్పు, రాగులు లేనట్లే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 07:33 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకుల పంపిణీ మొదలైంది. మార్చి ఒకటో తేదీ నుంచి నిత్యావసర సరుకులను రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నారు. లబ్ధిదారులకు బియ్యంతో పాటుగా అరకిలో పంచదార, కిలో గోధుమపిండి కూడా అందించనున్నారు. కొన్ని చోట్ల జొన్నలు, రాగుల పంపిణీ కూడా జరుగుతోంది. అయితే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల వంటి చోట్ల రాగుల పంపిణీ జరగడం లేదు. గత మూడు నెలలుగా రేషన్ కార్డుదారులకు రాగులను పంపిణీ చేశారు. అయితే మార్చి నెలలో మాత్రం ఇచ్చే పరిస్థితి లేనట్లు తెలిసింది.


  అవసరాలకు తగిన మొత్తంలో రాగులు సరఫరా కాలేదని సమాచారం. ముఖ్యంగా ఒడిశా నుంచి రావాల్సిన రాగులు రాలేదని.. దీంతో విశాఖపట్నం, అల్లూరి జిల్లాలలో రాగుల పంపిణీ జరగనట్లు సమాచారం. మరోవైపు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆదివారాలతో సహా రేషన్ షాపులు.. లబ్ధిదారులకు అందుబాటులో ఉండనున్న సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకూ, అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.


కందిపప్పు.. ఈసారి లేనట్లేనా..


మరోవైపు ఏపీలో రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నప్పటికీ.. కందిపప్పు సరఫరా మాత్రం జరగడం లేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాయితీపై కందిపప్పు అందిస్తే మధ్యతరగతి జీవికి కాస్త ఊరటగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఏపీలో కందిపప్పు పంపిణీ నిలిచిపోయి సుమారుగా ఏడాది కావొస్తోంది.


బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు నాణ్యత ఆధారంగా ధర రూ.110 నుంచి రూ.120 వరకూ పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు. రూ.67లకే అందించేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు సరఫరా చేయాలని జనం కోరుతున్నారు. అయితే పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొన్ని నెలలు పాటు కందిపప్పు సరఫరా చేశారు. ఆ తర్వాత కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa