ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరాంకో మూసివేత,,,సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ‌పై ఇరాన్ డ్రోన్ దాడి

international |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 07:35 PM

ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం మూడో రోజుకు చేరింది. అమెరికాకు మద్దతిచ్చే గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్.. డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులు చేస్తోంది. సోమవారం సౌదీలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. అలాగే, కువైట్ అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టే ప్రకటించింది. అయితే, ఈ సంఘటన ‘ఫ్రెండ్లీ ఫైట్’ కారణంగా జరిగి ఉండొచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి. కువైట్ గగనతలంలో మంటల్లో కాలిపోతూ ఎఫ్-15 యుద్ధ విమానం కూలిపోతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా.. అది అమెరికా లేదా ఇజ్రాయెల్‌కు చెందిందా? అనేది స్పష్టంగా తెలియరాలేదు. అయితే, విమానం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్టు మీడియా నివేదికలు తెలిపాయి.


 ఇదిలా ఉండగా, పలు అమెరికా యుద్ధ విమానాలు ఒకటి కూలిపోయినట్టు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ధ్రువీకరించింది. రెస్క్యూ ఆపరేషన్ మొదలైందని, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని కువైట్ రక్ష మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై స్పష్టత లేదు. కువైట్‌లో అమెరికా రాయబార కార్యాలయం వద్ద పేలుడు చోటుచేసుకున్నట్టు మీడియా పేర్కొంది. అయితే, దీనిని అమెరికా, ఇజ్రాయెల్‌ ఇంకా ధ్రువీకరించలేదు.


ఇరాన్ డ్రోన్ దాడులతో సౌదీ అరేబియా ప్రభుత్వ రంగ సంస్థ ఆరాంకో రాస్ తనురా రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసింది. సౌదీ అరేబియాలోని కీలక రిఫైనరీలో ఒకటైన రాస్ తనురాపై జరిగిన దాడి ఈ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలకు విస్తృత అంతరాయం కలిగిస్తుందనే భయాలను మరింత పెంచుతుంది. ఈ దాడిపై అరాంకో మీడియా కార్యాలయం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ, అరాంకో రాస్ తనురాను లక్ష్యంగా చేసుకున్న రెండు డ్రోన్‌లను కూల్చివేసినట్టు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అల్ అరేబియా వెల్లడించారు. ఈ రిఫైనరీలో రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి అవుతుంది. దాడి తర్వాత అక్కడ భారీగా మంటలు చెలరేగిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ ఆయిల్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్న తరుణంలో ఈ దాడి చోటుచేసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో సరఫరా స్తంభించిపోయింది. దీంతో ముడి చమురు ధరలు నాలుగేళ్లలో తొలిసారి గరిష్ఠానికి చేరుకున్నాయి. అధికారికంగా ఈ జలసంధిని ఇరాన్ మూసివేయనప్పటికీ, భద్రతా కారణాలతో నౌకా యజమానులు రవాణాను నిలిపివేశారు.


ఇంధన మార్కెట్లు ఇప్పుడు దీర్ఘకాలిక అస్థిరత ముప్పును ఎదుర్కొంటున్నాయి. హార్మూజ్ జలసంధి స్తంభించిపోతే చమురుకు పెరుగుతున్న డిమాండ్ కొద్దీ సరఫరా కఠినతరమవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు కారణమవుతుంది. ముఖ్యంగా, గల్ఫ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో ముడి చమురు బ్యారెల్‌కు 80 డాలర్లకు పెరిగింది. శనివారం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ, ఆ దేశ రక్షణ మంత్రి, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఉన్నతస్థాయి అధికారులు మరణించారు. దీంతో ఇజ్రాయెల్‌, పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ సహా 10 దేశాలపై దాడులు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa