ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గతం గతః.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 07:59 PM

తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో సాగుతున్న వివాదాలకు తెరపడినట్లు కనిపిస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని , తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో తిరువూరు పంచాయితీ టీడీపీ అధిష్టానానికి ఓ సమస్యలా మారిపోయింది. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటంతో టీడీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇటీవల నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘటనతో తిరువూరు పంచాయితీ మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


ఈ నేపథ్యంలోనే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో టీడీపీ నేత మంతెన సత్యనారాయణ రాజు భేటీ అయ్యారు. రాజకీయంగా కలిగే నష్టాలను కొలికపూడితో చర్చించారు. అనంతరం అసెంబ్లీ లాబీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కొలికపూడి కలిశారు. తిరువూరులో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఎంపీ కేశినేని శివనాథ్‌తో వివాదంపై చర్చించారు. అనంతరం తిరువూరులో వివాదాలు ముగిసిపోయినట్లేనంటూ కొలికపూడి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతం గతః అంటూ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కొలికపూడికి తాను చెప్పాల్సింది చెప్పానని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.


మరోవైపు తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్నికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని ఎమ్మెల్యే కొలికపూడి చెప్తున్నారు. ఇదే సమయంలో ఆయన నుంచి కూడా అదే ఆశిస్తానని అన్నారు. తన చర్యలతో పార్టీకి ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నానన్న కొలికపూడి శ్రీనివాసరావు.. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ఇక మీదట నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా.. జోనల్‌ కో ఆర్డినేటర్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అలాగే రాజకీయాల కోసం కులం కార్డు తీయటమనేది తన అభిమతం కాదని.. ఈ విధానానికి తాను పూర్తి వ్యతిరేకమని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.


మరోవైపు తన చుట్టూ ఉండే ఒకరిద్దరు వ్యక్తులు.. అలాగే ఎంపీ కేశినేని చిన్ని వెంట ఉండే ఒకరిద్దరి వ్యక్తుల వలన ఇలాంటి సమస్యలు వచ్చి ఉండొచ్చని కొలికపూడి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఇక మీదట తన వైపు నుంచి సమస్యలు రాకుండా అప్రమత్తంగా ఉంటానని.. జాగ్రత్తలు తీసుకుంటానని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa