గత కొన్నిరోజులుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భీకర దాడులు చేస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ దాడులతో పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఆ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే.. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం వెళ్లిన వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అక్కడ ఉన్న తమ వారు ఎలా ఉన్నారోననే ఆందోళన భారత్‌లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎక్కువవుతోంది.
ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు.. ఆకస్మికంగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగానే ఈ మార్చి నెల తొలి వారంలోనే గల్ఫ్ దేశాల నుంచి ఏకంగా 52 వేల మందికిపైగా భారతీయులు తిరిగి మన దేశానికి వచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు విదేశాంగ అధికారులు తెలిపారు.
యుద్ధం, దాడుల కారణంగా గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసుల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వందలాది విమానాలు రద్దు కావడంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. ఇటీవల కొన్ని దేశాలు, నగరాల నుంచి విమానాల రాకపోకలు పాక్షికంగా ప్రారంభం అయ్యాయి. దీంతో ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య 52,000 మందికిపైగా భారతీయులు తిరిగి తమ దేశానికి చేరుకున్నారు. వీరిలో దాదాపు 32 వేల మంది భారతీయులు.. మన దేశ విమానాల్లోనే ప్రయాణించడం గమనార్హం.
రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. విమాన సర్వీసులు అందుబాటులో లేని దేశాల్లో ఉన్న భారతీయులు.. ఆయా దేశాల్లో ఉన్న స్థానిక రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లను సంప్రదించాలని విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో ఉంటున్న భారత పౌరుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపింది. సహాయం అవసరమైన వారికి అండగా నిలిచేందుకు ఆయా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది.
పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయులు.. స్థానిక అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలు.. భారత దౌత్య కార్యాలయాలు ఇచ్చే సలహాలు పాటించాలని విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. ఇప్పటికే అవసరమైన అడ్వైజరీలను జారీ చేసినట్లు తెలిపింది. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో విదేశాంగ శాఖ ఆఫీస్‌లో ఒక స్పెషల్ కంట్రోల్ రూంను (1800118797 (టోల్ ఫ్రీ), +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905)కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa