రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 11 మంది మరణించడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం, ఆహార భద్రతా వైఫల్యమే ఈ ఘోరానికి కారణమని ఆరోపించారు.నేడు రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది ప్రమాదం కాదని, అధికారుల ఉదాసీనత వల్లే జరిగిందని అన్నారు. వరలక్ష్మి అనే పాల వ్యాపారి దాదాపు 11 ఏళ్లుగా ఎలాంటి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నా, ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శించారు. అధికారులకు తెలియకుండా ఇన్నేళ్లుగా అక్రమ వ్యాపారం ఎలా సాధ్యమైందని ఆమె ప్రశ్నించారు.ఇథిలీన్ గ్లైకాల్ కలిపిన పాలు తాగడం వల్లే పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, కొందరు వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలు, నెయ్యి, మద్యం, తాగునీరు సహా అన్ని నిత్యావసరాలు కల్తీమయం అవుతున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజమండ్రి వంటి నగరానికి ఒక్కరే ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండటం, ఆయన కూడా స్థానికంగా అందుబాటులో లేకపోవడం సిబ్బంది కొరతకు నిదర్శనమన్నారు.ఈ ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక, పరిపాలనా బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ విభాగంలో వెంటనే భారీగా నియామకాలు చేపట్టి, కఠిన తనిఖీలు నిర్వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ. 10 లక్షల పరిహారాన్ని రూ. 25 లక్షలకు పెంచాలని కోరారు. బాధితులను మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకు పరామర్శించకపోవడం సరికాదని అన్నారు. సామాన్య ప్రజల పట్ల ఆయన వైఖరి ఏంటో దీని ద్వారా తెలుస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఆహార భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయకపోతే ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa