అంతర్జాతీయంగా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తోంది. అమెరికా కూడా ఇరాన్‌పై దాడులు చేస్తుండగా.. ఇరాన్ అమెరికా- ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపైనా భీకర దాడులు చేస్తోంది. ఈ యుద్ధం ప్రభావంతో చమురు, సహజవాయువు సరఫరాలో కొరత తలెత్తనుందనే భయాలు నెలకొన్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని కేంద్రం పెంచింది. గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 60, కమర్షియల్ సిలిండర్ ధర రూ. 115 చొప్పున పెరిగింది. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య బుకింగ్ గడువు 21 రోజులుగా ఉండగా.. దీనిని 25 రోజులకు పెంచింది.
చాలా మంది సిలిండర్లకు కొరత ఏర్పడవచ్చన్న భయాలతో.. ముందస్తుగా బుక్ చేస్తున్నారు. గతంలో సగటున 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వారు కూడా ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో 15 రోజులకే గ్యాస్ బుక్ చేస్తుండటం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో 21 రోజుల లాకిన్ నిబంధన తెచ్చింది. ఇప్పుడు ఆ గడువును 25 రోజులకు పెంచినట్లు తెలుస్తోంది.
ఎల్పీజీ సరఫరాలో కాస్త అంతరాయం నేపథ్యంలో.. వాస్తవానికి ఆయిల్ కంపెనీలు కొద్ది రోజుల ముందే ముందస్తు చర్యలకు దిగాయి. కనీస గడువును బుధవారం నుంచే చమురు సంస్థలు అనధికారికంగా అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. డబుల్ సిలిండర్ ఉన్న వారికి గడువు 30 రోజులు.. సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 21 రోజులుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పుడు దానినే 25 రోజులకు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దేశీయ వినియోగదారులకే ప్రాధాన్యం ఇవ్వాలి..!
>> పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వంట గ్యాస్ లభ్యతను నిర్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ పవర్స్‌ను ఉపయోగిస్తోంది. ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది. పారిశ్రామిక అవసరాలకు కాకుండా.. గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరానే తొలి ప్రాధాన్యంగా ఉండాలని చమురు సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. ఇతర ఎగుమతులకు కాకుండా.. దేశీయ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఇంకా ఈ ఎల్‌పీజీ.. ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు మాత్రమే విక్రయించాలని తన ఆదేశాల్లో కేంద్రం పేర్కొంది.
దీంట్లో భాగంగానే.. ఎల్పీజీ ఉత్పత్తికి కీలకంగా ఉన్నటువంటి బ్యూటేన్, ప్రొపేన్‌ను పెట్రో కెమికల్ ప్రొడక్షన్ కోసం దారి మళ్లించొద్దని రిఫైనరీలకు కేంద్రం సూచనలు చేసింది. దేశంలో ఎల్‌పీజీ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. గ్యాస్ అవసరాలు తీర్చుకునేందుకు భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సహజవాయువు దిగుమతిదారుగా ఉన్న ఇండియా గత ఏడాది 33.15 మిలియన్ మెట్రిక్ టన్నుల వంటగ్యాస్‌ను దిగుమతి చేసుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా.. రవాణాకు అంతరాయం కలిగినా దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో 33.2 కోట్లకుపైగా యాక్టివ్ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa