ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నదాత సుఖీభవ నిధులు, 2.5 లక్షల గృహప్రవేశాలు,,,,చంద్రబాబు వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 12, 2026, 06:15 PM

సంపద సృష్టితో పాటు పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశనిర్దేశనం చేశారు. అమరావతిలో జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్య, వైద్యం, ఆదాయార్జన, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై కూడా సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు సీఎం తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ప్రజా ప్రతినిధుల ద్వారా సంక్షేమ కార్డులను అందజేయాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులకు అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చారు.


పథకాల అమలులో పారదర్శకత, ఓనర్‌షిప్ తీసుకునేందుకు సంక్షేమ కార్డులను ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. పెట్టుబడులే కాకుండా పేదల గురించి కూడా ఆలోచించాలని ఆయన సూచించారు. మూడో విడత అన్నదాత సుఖీభవ నిధులు రేపు (మార్చి 13న శుక్రవారం) విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకూ అన్నాక్యాంటీన్ల ద్వారా పేదలకు 7.5 కోట్ల భోజనాలను అందించామని, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ అమలు చేస్తున్నామని చెప్పారు. రూ. 1,000 కోట్లతో రహదారులు మరమ్మతులు చేపట్టినట్టు గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ కింద రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు.


పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమాంతరంగా సాగేలా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని సీఎం ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటిస్థలం లేదా ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉగాది పండుగ రోజున సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించి, 2.50 లక్షల మందికి ఇళ్లను అందజేయనున్నట్టు తెలిపారు. జల జీవన్ మిషన్ కింద ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.


దీపం 2.0 పథకానికి డిజిటల్ ఓచర్ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ‘స్త్రీ శక్తి’ పథకం కింద మార్చి 9 వరకు ఆర్టీసీలో రా 50.45 కోట్ల ప్రయాణాలు చేశారని.. ఇందుకు గానూ రూ.1,775 కోట్లను ప్రభుత్వం రీయింబర్స్ చేసిందని సీఎం వివరించారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సహకారంతో పీ4 సహా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్లకు సీఎం దిశ నిర్దేశనం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa